చాలా మంది డబ్బు పోగు చేసుకుని ఇల్లు, ప్లాట్ లేదా ఇతర ప్రాపర్టీ కొంటుంటారు. ఇలాంటి సొంత ఫిక్స్డ్ అసెట్ ఉంటే ఆర్థిక రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో దాని విలువ పెరుగుతూ.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా ఉంటుంది. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. ఇలాంటి సందర్బాల్లోనే హోమ్లోన్లు సహకారంగా ఉంటాయి.
* మహిళలకు హోమ్‌లోన్- ప్రయోజనాలు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోమ్ లోన్లు తీసుకునే మహిళలకు స్టాంప్ డ్యూటీపై 1 శాతం నుంచి 2 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఈ విధంగా రూ.50 లక్షల విలువైన ప్రాపర్టీపై రూ.50,000 నుంచి రూ.1,00,000 ఆదా చేయవచ్చు. హోమ్‌లోన్ రీపేమెంట్లో.. ప్రిన్సిపల్ రీపేమెంట్, వడ్డీ చెల్లింపులకు గరిష్టంగా రూ.1.5 లక్షలు, రూ.2 లక్షలు ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది.
భార్యాభర్తలు ఉమ్మడిగా ప్రాపర్టీని కలిగి ఉంటే, ప్రతి ఒక్కరికి వేర్వేరు ఆదాయ వనరులు ఉంటే, ఇద్దరూ ట్యాక్స్ డిడక్షన్‌కు అర్హులు. అలాగే వీరికి తక్కువ స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. స్టాంప్ డ్యూటీ అనేది ప్రాపర్టీ ధరను పెంచే అదనపు ఖర్చు. అనేక భారతీయ రాష్ట్రాలు స్త్రీలు ఆస్తిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించే ప్రయత్నంలో స్టాంప్ డ్యూటీలో 1 శాతం నుంచి 2 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. దీని ద్వారా మహిళకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. మహిళలకు రాయితీతో వడ్డీరేట్లు అందిస్తున్న బ్యాంకుల వివరాలపై ఓ లుక్కేయండి.
* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్తించే వడ్డీ రేటులో 0.05 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. మహిళా దరఖాస్తుదారులు రుణగ్రహీతలు/సహ రుణగ్రహీతలుగా, ప్రతిపాదిత హౌసింగ్ ప్రాపర్టీలో యజమాని/సహ యజమానిగా ఉండాలి.