ప్రముఖ భారత బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను క్రమంగా పెంచడంతో, కమర్షియల్ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఎఫ్డీలపై 7-8 శాతం వడ్డీని అందిస్తుండగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 9 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. రిస్క్ లేని, నిర్ణీత రాబడికి హామీ ఇచ్చే పథకాలుగా ఫిక్స్డ్ డిపాజిట్ (FD)లు పాపులర్ అయ్యాయి. ఎఫ్డీ రేట్లు ఏయే బ్యాంకులో ఎంత వరకు ఉన్నాయి, వీటిలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది తెలుసుకుందాం.
అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.75-7 శాతం, RBL బ్యాంక్ 3.25-7.55 శాతం, KVB బ్యాంక్ 4-7.25 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.50-7.25 శాతం, కెనరా బ్యాంక్ 3.25-7 శాతం చొప్పున ఎఫ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్ 3.5-7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3-6.75 శాతం, IDFC ఫస్ట్ బ్యాంక్ 3.5-7.5 శాతం ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయి.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4.5-8.5 శాతం, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3.75-7.85 శాతం, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4-8 శాతం, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3.5-8 శాతం, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3-8 శాతం, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3.75-7.75 శాతం, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3.50- 7.5 శాతం, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3-7.75 శాతం ఎఫ్డీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
* వడ్డీరేట్ల పెంపుకు కారణాలు?
ఆర్బీఐ గత ఏడాది మే నుంచి రెపో రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చింది. మే నెలలో 40 బీపీఎస్, జూన్లో 50 బేసిస్ పాయింట్లు, ఆగస్టులో 50 బేసిస్ పాయింట్లు, సెప్టెంబర్లో మళ్లీ 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును ఆర్బీఐ పెంచింది. డిసెంబర్లో మరోసారి 35 బీపీఎస్ పెంచగా, ఈ పెరుగుదల 225 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. దీంతో బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 2012-2013లో 8.75-9 శాతంగా ఉండేవి. 2019-2020లో రేట్లు సగటున 5.7-6.4 శాతం వరకు పడిపోయాయి. 2020-21లో మరింత తగ్గి, 5.25- 5.35 శాతం వరకు చేరుకున్నాయి. కోవిడ్ సమయంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో FD రేట్లు 5.5 శాతానికి పడిపోయాయి. అయితే కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ రెపో రేట్లను పెంచింది. ఫలితంగా డిపాజిట్ రేట్లు ప్రస్తుతం గరిష్టానికి చేరుకున్నాయి.
* FD రేట్లు ఇంకా పెరుగుతాయా?
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. బ్యాంక్ ఎఫ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది. ఈ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచేందుకే ఆర్థిక సంస్థలు మొగ్గుచూపుతాయి. దీనికి తోడు రాబోయే నెలల్లో మార్కెట్ లిక్విడిటీ కఠినంగా ఉంటుందని కూడా అంచనాలు ఉన్నాయి. ఫలితంగా రాబోయే నెలల్లో ఎఫ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇకనుంచి చాలా తక్కువ మేర రేట్ల పెంపు ఉండవచ్చు.
వీటిలో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలా? కొన్ని రోజులు ఆగడం మంచిదా?
చాలా బ్యాంకులు ఇప్పటికే ఎఫ్డీ రేట్లను గరిష్ట స్థాయికి పెంచాయి. భవిష్యత్తులో రేట్లు పెరిగినా, ఆ గ్రోత్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకొన్ని రోజులు ఎదురుచూడటం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. లిక్విడిటీ అవసరాలు, వడ్డీ రేట్లు, ఆర్థిక లక్ష్యాలు అన్నింటినీ విశ్లేషించుకొని.. ఎక్కువ రాబడి ఇచ్చే ఎఫ్డీలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడమే మంచిదని సూచిస్తున్నారు.