2021 ఏడాది ముగింపుకు చేరుకున్నాం. మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. కేవలం తమ శారీరక లేదా వృత్తిపరమైన విషయాలపైనే కాకుండా ఆర్థిక విషయాలపై కూడా లక్ష్యాలు ఏర్పర్చుకుంటారు. నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రతి వ్యక్తి ఎటువంటి ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ ఏర్పర్చుకోవాలో తెలుసుకుందాం.
మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి
మీ ఆస్తి నికర విలువ, రుణాలు, పొదుపు, వార్షిక ఆదాయంలో పొదుపు, లిక్విడిటీ, క్యాష్ టు అసెట్, సాల్వెన్సీ రేషియో, నెలవారీ వాయిదాలు, వార్షిక ఆదాయం వంటివి అంచనా వేసుకోవాలి. ఇది మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి మాత్రమే కాకుండా, భవిష్యత్తులో సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
టాక్స్ సేవింగ్స్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయండి.. చాలా మంది ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలోనే టాక్స్ సేవింగ్స్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కువగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPPF), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్లలో (ELSS) ప్లానల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఇది మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
ఆర్థిక వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయండి.. మీ ఆర్థిక వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేయండి. బ్యాంకు ఖాతాలు, బీమా, పెట్టుబడులు తదితర వివరాలను కనీసం జీవిత భాగస్వామికి తెలియజేయాలి. తద్వారా మీకు అనుకోని ప్రమాదం జరిగితే మీ జీవిత భాగస్వామి మీ పేరిట ఉన్న పాలసీలను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.