ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇది మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందజేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ మొత్తాన్ని ఈసారి బడ్జెట్లో రూ.8,000కు పెంచే అవకాశం ఉంది. రూ.2000 చొప్పున నాలుగు విడతల్లో రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు.
* ఇప్పటి వరకు 12 విడతల్లో జమ : కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మోదీ సర్కార్ 2019 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.2000 చొప్పున మూడు విడతల్లో మొత్తంగా రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ప్రారంభంలో కేవలం 2 హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు.
* జనవరి చివరిలో 13 విడత నిధులు జమ : పీఎం కిసాన్ 13వ విడత నిధులు జనవరి చివరిలో రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ప్రధాని మోదీ 13వ విడత నిధులను రైతుల ఖాతాల్లో త్వరలో విడుదల చేయనున్నారు. దాదాపు 13 కోట్ల రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనం అందనుంది.
పీఎం కిసాన్ లబ్ధిదారులు తప్పనిసరిగా జనవరి 28లోపు ఇ-కేవైసీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇందుకు ఇక ఒక రోజు మాత్రమే గడువు ఉంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా తమ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు. లేదా సీఎస్సీ, వసుదా కేంద్రాల్లో రూ.15 చెల్లించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
* ఇ-కేవైసీ ప్రాసెస్ : లబ్ధిదారులు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి. రైతుల విభాగాన్ని ఎంచుకుని ఇ-కేవైసీ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, సబ్మిట్ క్లిక్ చేయండి.