ఎవరైనా ఉద్యోగం చేస్తున్నంత కాలం అవసరాలు అన్నీ తీరుతాయి. పదవీ విరమణ పొందిన తర్వాత పరిస్థితులు మారుతాయి. వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలకు ఇబ్బంది పడకుండా సురక్షితంగా ఉండటానికి చాలా మంది EPFలో ఇన్వెస్ట్ చేస్తారు. దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. పదవీ విరమణకు చేరుకున్నప్పుడు, పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది.
అయితే ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EFPO) లేటెస్ట్ సర్క్యులర్ కొందరు విశ్రాంత ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. 2014 సెప్టెంబర్ కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి అధిక పెన్షన్ లభించడానికి సంబంధించిన కేసులను తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. దీంతో గత ఐదు సంవత్సరాలుగా లేదా అంతకంటే ఎక్కువ కాలం అనుభవిస్తున్న ప్రయోజనాలను కోల్పోతామనే ఆందోళనలో కొందరు పెన్షనర్లు ఉన్నారు.
తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్‌గా 2022 నవంబర్ నాటి సుప్రీంకోర్టు తీర్పులోని కొన్ని పేరాలను EPFO వివరించింది. పేరా 11(3) పెన్షన్ పొందే అత్యధిక శాలరీ గురించి వెల్లడించింది. ఉద్యోగులు, యజమానులకు జాయింట్ ఆప్షన్, చట్టబద్ధమైన సీలింగ్ కంటే ఎక్కువ వేతనాలపై యజమానుల కాంట్రిబ్యూషన్ చెల్లింపును అనుమతించే సెక్షన్‌ను 2014 సెప్టెంబర్ 1లో సవరించారు.
* ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారం : EPFO తనకున్న అధికారంతో సర్క్యులర్‌ను జారీ చేసిందని పెన్షనర్ల హక్కుల కార్యకర్త పర్వీన్ కోహ్లీ ‘ద హిందూ’ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సర్క్యులర్ వివరాలను దాచిపెట్టి, వాస్తవాలను వక్రీకరిస్తోందని పేర్కొన్నారు.