పాన్ కార్డు స్కాన్డ్ కాపీ, ఆధార్ కాపీ, సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్... ఇలా మన దగ్గర చాలా రకాల డాక్యుమెంట్లు ఉంటాయి. ఒకప్పుడు అయితే ఇవేవైనా అవసరం పడితే తీసుకెళ్లాలి. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోవడంతో వాటి సాఫ్ట్ కాపీలు ఉంటే సరిపోతుంది. అయితే వీటిని ఎలా ఎప్పుడూ మన దగ్గరే ఉంచుకోవడం అనేదేగా ప్రశ్న. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఒక యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. దానిపేరు డిజీ లాకర్. గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ తరహాలోనే క్లౌడ్ ఆధారిత సర్వీసు ఇది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రం దీన్ని రూపొందించింది. ఇది ఎలా పని చేస్తుందంటే..
డిజీలాకర్ యాప్‌ను ప్లేస్టోర్/ యాప్ స్టోర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వెబ్సైట్ /)లోకి వెళ్లి సర్వీసులు పొందొచ్చు. యాప్/వెబ్సైట్లోకి వెళ్లాక మొబైల్ నెంబరుతో అకౌంట్ తెరవాలి. ఆధార్‌తో అనుసంధానం చేసిన మొబైల్ నెంబరుతో ఇంకా మంచిది. ఖాతా తెరవడానికి మొబైల్ నెంబరు ఇచ్చాక... ఒక ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను యాక్టివ్ చేసుకోవచ్చు. అలా మీకు డిజీలాకర్ ఖాతా క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అప్లోడెడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్లాలి. ఆ సెక్షన్ టాప్‌లో అప్లోడ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్లో ఉన్న పీడీఎఫ్/ఫైల్స్‌ను అప్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మళ్లీ యాప్/వెబ్సైట్లోకి వచ్చి, ఆ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే షేర్ చేయొచ్చు.
ఆధార్ కార్డు, పాన్‌కార్డు వెరిఫికేషన్ రికార్డు, యూఏఎన్ కార్డు, వేకిల్ ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ లాంటివాటిని నేరుగా ఆయా శాఖల నుంచి యాప్‌లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఇష్యూడ్ డాక్యుమెంట్స్లోకి వచ్చి చేరుతాయి. వీటితోపాటు ఎల్పీజీ సబ్స్క్రిప్షన్ వోచర్, వెహికల్ టాక్స్ రిసిప్ట్ లాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఎన్నో రకాల సర్వీసులను ఇక్కడి నుండి పొందొచ్చు. అన్నట్లు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను కూడా డిజీ లాకర్లో తీసుకోవచ్చు. యాప్ వాడేవారైతే... నాలుగు అంకెల పాస్ కోడ్‌ను పెట్టుకోవచ్చు. అంటే ప్రతిసారి యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ పాస్‌కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల రక్షణ ఉంటుంది. అలాగే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్ నెంబరు లేదా యూజర్ నేమ్ ఆధారంగా లాగిన్ అవ్వాలి. ఈ సమయంలో ఆరు అంకెల కోడ్ అడుగుతుంది. దానిని ప్రొఫైల్ క్రియేట్ చేసే సమయంలోనే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.