మత్స్య సంపద ఆమెకు కొత్త ఉపాధి వనరుగా మారింది. జాగ్రత్తగా చేస్తే... చేపల వ్యాపారం లాభదాయకమే. దీని ద్వారా ప్రతినెలా లక్షల్లో సంపాదించవచ్చు. చేపల పెంపకం వ్యాపారానికి ఈమధ్య ఆదరణ పెరిగింది. ప్రజలు ఇప్పుడు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి మరీ ఈ వ్యాపారంలో అడుగుపెట్టి.. ప్రయత్నించి విజయం సాధిస్తున్నారు. టీచర్ ఉద్యోగం వదిలేసి చేపల పెంపకం ప్రారంభించిన వారిలో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన పూసికా యాదవ్ ఒకరు.
సంవత్సరమంతా తాజా చేపల కోసం డిమాండ్ ఉందని ఆమె గుర్తించింది. 2020 సంవత్సరంలో చేపల పెంపకం కోసం 1.7 హెక్టార్ల విస్తీర్ణంలో రెండు చెరువులు, 0.3 హెక్టార్ల విస్తీర్ణంలో మూడో చెరువును నిర్మించింది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రకారం ఆమె మొదట చిన్నగా ప్రారంభించింది. ఐతే.. స్థానిక రైతులు నిరంతరం చేపలు కొంటూ ఉండటంతో.. అది ఆమెకు కలిసొచ్చింది. చేతికి భారీగా డబ్బు రావడం మొదలైంది.
ఎదుర్కొన్న సవాళ్లు : ఆమె మొదటి బ్యాచ్లో 2.5 లక్షల చేప పిల్లల పెంపకం చేపట్టింది. ఐతే.. శిక్షణ లేని కార్మికులు, అధిక విద్యుత్ బిల్లులు, చేపల రవాణాకు మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లను ఆమె ఎదుర్కొంది. తర్వాత కార్మికులకు శిక్షణ ఇప్పించింది. వారికి జీవనోపాధి కల్పించింది. అలాగే.. చేప విత్తనాల్ని రవాణా చేయడానికి ఒక వాహనాన్ని కొంది.