2024 స్వారత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై మధ్యతరగతి ప్రజలతో పాటు ఇతర వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. మధ్యతరగతి ఒత్తిళ్లను అర్థం చేసుకుంటానని ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు మధ్యతరగతి వర్గాల్లో అంచనాలు పెంచాయి. బడ్జెట్ 2023 నుంచి ప్రధానంగా ప్రజలు ఆశిస్తున్న, ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్న 5 అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.
* బేసిక్ ఎగ్జమ్షన్ లిమిట్ పెంపు : సామాన్యులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా బేసిక్ ఎగ్జమ్షన్ లిమిట్‌ను పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని నిపుణులు భావిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు మినిమం ట్యాక్స్ ఎగ్జమ్షన్ లిమిట్ ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉందని, రూ.7.5 లక్షలకు పెంచాలని సూచిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్ల ఆదాయం రూ.12.5 లక్షల వరకు ఉంటే ట్యాక్స్ ఎగ్జమ్షన్ కల్పించాలని అసోచామ్ ప్రీ-బడ్జెట్ నోట్లో పేర్కొంది.
* ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు తగ్గింపు : రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను రేట్లను తగ్గించి, ఉద్యోగుల కోసం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లు ప్రకటించాలని కోరుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రాయితీతో కూడిన ఆదాయ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం మినహా 2016-17 బడ్జెట్లో ట్యాక్స్ శ్లాబ్‌లు మారలేదు. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 30 శాతం, 25 శాతం పన్ను రేట్లను తగ్గించాలని భావిస్తున్నారు.
* పాన్ కార్డ్ చట్టబద్ధత : యూనియన్ బడ్జెట్ 2023-24 పర్మినెంట్ అకౌంట్ నంబర్(PAN)ను సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్‌గా చట్టబద్ధం చేసే అవకాశం ఉంది. పాన్ నంబర్‌ను స్వీకరించడానికి లీగల్, ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ కోసం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS)ని యాక్సెస్ చేయడానికి - GSTIN, TIN, EPFO సహా 20 విభిన్న IDలు ఉన్నాయి. పెట్టుబడిదారులు మల్టిపుల్ ఐడెంటిఫికేషన్ డీటైల్స్ పూరించాల్సిన అవసరం ఉండదు. కొత్త నిబంధన పెట్టుబడిదారులకు చాలా శ్రమను తగ్గిస్తుంది.
* లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నాన్ ట్యాక్సబుల్ లిమిట్ పెంచాలి : లిస్టెడ్ ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా వచ్చే లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG) ఏడాదికి రూ.1 లక్ష దాటితే పన్ను చెల్లించాలి. రిటైల్ పెట్టుబడిదారుల కోరిక మేరకు.. సంవత్సరానికి రూ.1 లక్షగా ఉన్న నాన్-టాక్స్ లిమిట్‌ను కనీసం రూ.2 లక్షల రూపాయలకు పెంచే సూచనలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరిరంగన్ మనీకంట్రోల్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
* మరో 400 వందే భారత్ రైళ్లు : గత బడ్జెట్లో వచ్చే మూడేళ్లలో 400 సెమీ-హై-స్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్లో మరో 400 కొత్త వందే భారత్ రైళ్ల ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన మార్గాల్లో వేగాన్ని గంటకు 180 కి.మీ. పెంచే యోచనలో ఉంది. రాజధాని, శతాబ్ది వంటి రైళ్ల సహా ప్రస్తుతం ఉన్న అన్ని హై-స్పీడ్ రైళ్లను క్రమంగా భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.