కరోనా, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావాలతో ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ లేదా వంటనూనెల (Edible Oil) ధరలు అమాంతం పెరిగాయి. సామాన్యులు వంటనూనెలు కొని వినియోగించలేని పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ధరలు పతనం కావడంతో పాటు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడంతో ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ ధరలు గణనీయంగా పడిపోయాయి.
మన దేశం ఇంపోర్ట్ చేసుకునే ఎడిబుల్ ఆయిల్స్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రా, కస్టమ్ డ్యూటీ, డెవలప్మెంట్ సెస్‌లను మినహాయిస్తున్నట్లు 2021 అక్టోబరులో కేంద్రం ప్రకటించింది. తర్వాత ఈ మినహాయింపులను 2022 మార్చి వరకు, అనంతరం 2022 సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఇప్పుడు మరోసారి ఆరు నెలలు కస్టమ్ డ్యూటీ మినహాయింపులను మినహాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఈ విషయంపై స్పందించింది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA). క్రూడ్ పామాయిల్, ఆర్.బి.డి పామోలిన్, ఆర్.బి.డి పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రస్తుత డ్యూటీ స్ట్రక్చర్ 2023 మార్చి 31 వరకు మారదని పేర్కొంది.
* 60 శాతానికి పైగా దిగుమతులే : గత ఏడాది పొడవునా ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉండటంతో, డొమెస్టిక్ సప్లైని పెంచేందుకు ప్రభుత్వం చాలాసార్లు పామాయిల్‌పై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. భారతదేశం ఎడిబుల్ ఆయిల్ అవసరాలలో 60 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. మలేసియా, ఇండోనేషియా, అర్జెంటీనా, ఉక్రెయిన్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. గ్లోబల్ ప్రైజెస్ పెరుగుదల తర్వాత గత కొన్ని నెలల్లో రిటైల్ ధరలు ఒత్తిడికి గురయ్యాయి. కానీ ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయి.
* ఇంకా ఎక్కువే.. : ఇన్ని చర్యలు తీసుకున్నా వంట నూనెల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అందజేసిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 1న.. వేరుసెనగ నూనె సగటు రిటైల్ ధర కిలోకు రూ.188.04, ఆవాల నూనె (రూ.172.66/కేజీ), డాల్డా (రూ.152.52/కేజీ), సోయాబీన్ ఆయిల్ (రూ.156/కేజీ.), సన్‌ఫ్లవర్ ఆయిల్ (రూ.176.45/కేజీ), పామాయిల్ (రూ.132.94/కేజీ)గా ఉన్నాయి.