మన దేశంలో ప్యాజింజర్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నప్పటికీ, లగ్జరీ వెహికల్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో టాప్ బ్రాండ్స్‌లో ఒకటిగా పేరొందింది జర్మన్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిణామాలతో ఈ సంస్థ తమ లగ్జరీ వెహికల్స్ ధరలను పెంచింది. మన దేశంలో కూడా ఈ వెహికల్స్ ధరలు ఏప్రిల్ 1 నుంచి ఐదు శాతం పెరగనున్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ పీటీఐతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.
యూరోతో పోలిస్తే రూపాయి క్షీణత, లాజిస్టిక్స్‌తో పాటు ఇతర ఇన్పుట్ కాస్ట్స్ పెరిగాయని, ఇది కంపెనీ మొత్తం ఆపరేషనల్ కాస్ట్ పెరిగేందుకు కారణమయ్యాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనవరి తర్వాత మరోసారి ఇండియాలో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. జనవరిలో ఇప్పటికే ఈ కంపెనీ కార్ల ధరలను 5 శాతం వరకు పెంచింది.
అయితే వినియోగదారులపై ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించేందుకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఫైనాన్సింగ్ ఆప్షన్స్ అందిస్తోందని సంతోష్ అయ్యర్ తెలిపారు. తమ బ్రాండ్ నుంచి అమ్ముడయ్యే కార్లలో దాదాపు 80 శాతం ఫైనాన్స్‌పై ఉన్నాయని, కాబట్టి తాజా ధరల పెంపు నిర్ణయంతో EMI ప్రభావం రూ. 2,000 నుంచి రూ. 3,000 కంటే ఎక్కువ ఉండదని వివరించారు.
టాప్ ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో బెంజ్ కంపెనీ నుంచి GLS 400d 4M, S 350d, S 450 4M, Mercedes-Maybach S 580, EQS 580 మోడళ్లను అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు వరుసగా రూ.1కోటి 29 లక్షలు; రూ.1కోటి 71 లక్షలు; రూ.1 కోటి 80 లక్షలు; రూ.2 కోట్ల 69 లక్షలు; రూ.1 కోటి 59 లక్షలకు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)