కస్టమర్లకు యాక్సిస్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై(Fixed Deposits) వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. నిర్దేశిత కాల పరిమితితో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 40 బేసిన్ పాయింట్ల మేర రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లను నేటి నుంచే (2023, మార్చి 10) అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచడంతో యాక్సిస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో ఎఫ్డీలపై వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. రూ.2 కోట్ల లోపు డిపాజిట్ మొత్తంతో కూడిన ఎఫ్డీలపై వడ్డీ రేటును 6.75 నుంచి 7.15 శాతానికి పెంచుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
* కొత్త రేట్లు ఇవే.. : రూ.2 కోట్ల లోపు డిపాజిట్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంకు కల్పిస్తున్న వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లకు, సాధారణ కస్టమర్లకు ఆరు నెలల వరకు మెచ్యూరిటీ గడువు కలిగిన ఎఫ్డీలకు వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం వివిధ మెచ్యురిటీ గడువులతో కూడిన ఎఫ్డీలకు వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
6 నెలల నుంచి 9 నెలల ఎఫ్డీపై యాక్సిస్ బ్యాంక్ 5.75 శాతం వడ్డీరేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ లభిస్తుంది. 9 -12 నెలలకు 6 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అదే 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 24 రోజుల వరకు అయితే 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 వడ్డీని యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
యాక్సిస్ బ్యాంకు అందించే 24-30 నెలల ఎఫ్డీపై వడ్డీరేటు 7.26 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.01 శాతంగా ఉంది. అదే 30 నెలల నుంచి మూడేళ్ల లోపు ఎఫ్డీలపై 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మూడు నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఐదు నుంచి పదేళ్ల ఎఫ్డీపై కూడా వడ్డీ 7 శాతంగానే ఉంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.