ఆర్థిక మాంద్యం ప్రభావం బడా కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగాల కోత, బిజినెస్‌ల మూసివేత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో మరో వ్యాపారాన్ని పూర్తిగా మూసేయాలని డిసైడ్ అయింది. నష్టాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే ఎడ్ టెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను మూసివేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారానికి సైతం గుడ్‌బై చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
యాన్యువల్ ఆపరేటింగ్ ప్లానింగ్ రివ్యూ మేరకు నిర్ణయం
హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ఆపేయడానికి సంబంధించి అమెజాన్ ఓ ప్రకటన జారీ చేసింది. యాన్యువల్ ఆపరేటింగ్ ప్లానింగ్ రివ్యూ ప్రక్రియలో భాగంగా బెంగళూరు, మైసూర్, హుబ్లీ చుట్టూ ఉన్న చిన్న దుకాణాల కోసం నిర్వహిస్తున్న హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
భారీ నష్టాల్లో పేమెంట్స్, లాజిస్టిక్స్ వ్యాపారాలు
మరోపక్క అమెరికా ఆర్థిక మాంద్యం ముంగిట్లో ఉంది. దీనికితోడు భారత మార్కెట్లో అమెజాన్ ఇప్పటి వరకు రూపాయి లాభం కళ్ల చూడలేదు. పైగా ఏటేటా నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో నష్టాలు, వ్యయాలను పరిమితం చేసుకునేందుకు అమెజాన్ పలు వ్యాపారాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. మార్కెట్ ప్లేస్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ వ్యాపారాల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ తన నష్టాలను 23% తగ్గించుకుని రూ.3,649 కోట్లకు చేరింది. అయితే మరోపక్క పేమెంట్స్, లాజిస్టిక్స్ వ్యాపారాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఒకే నెలలో మూడు వ్యాపారాలకు గుడ్‌బై
మూడు వ్యాపారాలను మూసివేస్తున్నట్లు అమెజాన్ ఈ నెలలోనే ప్రకటించడం గమనార్హం. ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు అమెజాన్ గతవారం ప్రకటించింది. అంతకు ముందు ఎడ్టెక్ బిజినెస్ ‘అమెజాన్ అకాడమీ’ని కూడా మూసివేస్తున్నట్లు తెలిపింది. తాజాగా హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని కూడా ముసేస్తున్నట్లు వెల్లడించింది.
డిసెంబర్ 29, 2022 నుంచి ఈ సేవలను పూర్తిగా నిలిపివేస్తామని అమెజాన్ తన రెస్టారెంట్ భాగస్వాములకు స్పష్టం చేసింది. ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇక, అమెజాన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. దాదాపు 10,000 ఉద్యోగాలను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ఇది ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో డివైజెస్ అండ్ సర్వీసెస్ సహా కొన్ని విభాగాలలో జాబ్ రోల్స్‌ను తగ్గించడం ప్రారంభించింది.