కరోనా వచ్చి 20 నెలలైంది. దాదాపు 20 కోట్ల మంది ఆ వైరస్ బారినపడ్డారు. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ కరోనా ఎప్పటికి పోతుందో తెలియని పరిస్థితి. వ్యాక్సిన్లు కూడా ఆపలేకపోతుండటం విచారకరం. కరోనా వచ్చాక... చాలా మంది ఉపాధి పోవడంతో... కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించారు. గుజరాత్... అహ్మదాబాద్లో బాగా బతికిన ఓ మ్యూజిక్ ఆర్టిస్ట్... ఇప్పుడు దీన స్థితికి చేరాడు. మ్యూజిక్ బ్యాండ్ ఆఫర్లు లేక... సొంత వ్యాపారం పెట్టుకున్నాడు.
హేమంత్ భాయ్ సోలంకీ... కాంగో, తబలా, ధోలక్... ఇలా చాలా సంగీత వాయిద్యాల్ని వాయించగలడు. గుజరాత్, ఇండియాలోని కొన్ని రాష్ట్రాలతోపాటూ... విదేశాల్లో కూడా షోలు చేశాడు. కరోనా వచ్చాక... అన్నీ ఆగిపోయాయి. పని లేకుండా పోయింది. దాంతో ఉన్న డబ్బుతో చెప్పుల షాపు పెట్టాడు. తద్వారా వచ్చే ఆదాయంతో తన ఫ్యామిలీని నెట్టుకొస్తున్నాడు. ఈ కరోనా ఎప్పుడు పోతుందా... ఎప్పుడు మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు.
2000 సంవత్సరం నుంచి మ్యూజిక్ నేర్చుకున్నాడు హేమంత్ బాయ్. 2007 నుంచే మ్యూజిక్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. 15 ఏళ్లలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాడు. వాటిలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అమెరికా, ఆప్రికా లాంటి దేశాల్లోనూ షోలు చేసిన అతని జీవితం ఇప్పుడిలా అయిపోయింది. బతకడానికి డబ్బు కావాలిగా... అందుకే చెప్పుల వ్యాపారం చేస్తున్నానని అతను చెప్పాడు.
హేమంత్ భాయ్... సోదరుడు వాసుదేవ్ కూడా మ్యూజిక్ ఆర్టిస్టే. అతనికీ ఇప్పుడు పని లేదు. కొత్త వ్యాపారం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాడు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆల్రెడీ చాలా మంది చాలా చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అవుతున్నా... సగం మందితోనే షో వెయ్యాల్సి వస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఫుల్లుగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్నా... అసలు ఆడియన్స్ రావట్లేదు. ఇక మ్యూజిక్ షోలకు మన దేశంలో గుర్తింపు అంతంతే.