ఫిబ్రవరి వచ్చేసింది. ఇంకో నెలలో దాదాపు పిల్లలకు పరీక్షలు అయిపోతాయి. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్. ఈ సమ్మర్‌కు ఎక్కడికి ట్రిప్ వెళ్లాలా? అని చాలా కుటుంబాలు ప్రణాళికలు మొదలుపెట్టేసి ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటే ట్రైన్ మాత్రమే సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పటి నుంచే టికెట్లు బుక్ చేసుకోకపోతే తర్వాత దొరకడం కష్టం.
అందులోనూ వచ్చేది సెలవుల కాలం కాబట్టి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఐఆర్సీటీస్ (IRCTC) అకౌంట్ ద్వారా ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. తరచూ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసేవాళ్లయితే కాస్త అనుభవం ఉండే ఉంటుంది.. కొత్తవాళ్లు అయితే మాత్రం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
* ఒక రోజు ముందు తత్కాల్ టికెట్లు : కొన్ని సందర్భాల్లో అర్జెంటుగా వేరే ఊరు వెళ్లాల్సి రావచ్చు. ట్రైన్ రిజర్వేషన్ చెక్ చేస్తే అప్పటికే వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్లకు తత్కాల్ టికెట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రయాణానికి ఒకరోజు ముందు దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ టికెట్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ టికెట్లు క్షణాల్లో అయిపోతాయి. టైం స్లాట్ మొదలుకాగానే బుక్ చేసుకోవడం మంచిది. అయితే సాధారణ ఛార్జీల కంటే దీని ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా టికెట్ బుక్ అయిన తర్వాత క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగిరావు. రైల్వే నిబంధనల ప్రకారం తత్కాల్ టికెట్లలో ఒక పిఎన్ఆర్(PNR)పై నలుగురికి మాత్రమే బుక్ చేసుకోగలరు.
* ఒక టికెట్‌పై ఆరుగురు మాత్రమే : రెగ్యులర్ రిజర్వేషన్ కి సంబంధించి స్లీపర్ క్లాస్, ఏసీ తరగతుల్లో ఒక ఐడీలో ఒకేసారి ఆరుగురికి మాత్రమే టికెట్ బుక్ చేయగలరు. అంటే సాధారణ రిజర్వేషన్లలో ఒక పీఎన్ఆర్ (PNR) నంబర్ పై ఆరుగురు మాత్రమే ప్రయాణించగలరు. ఆరుగురు కంటే ఎక్కువ మందికి బుక్ చేయాలంటే ప్రత్యేకమైన అనుమతి తప్పనిసరి.
* నెలకు 24 టికెట్లు : ఐఆర్సీటీసీ అకౌంట్‌ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. అలా చేసుకున్న వారు తమ ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC- ID) నుంచి నెలకు గరిష్ఠంగా 24 టికెట్లను బుక్ చేసుకోగలరు. ఒకవేళ అకౌంట్ ఆధార్‌తో లింక్ కాకపోతే 12 టికెట్లు వరకు మాత్రమే బుక్ చేయగలరు. గతంలో ఈ సంఖ్య ఆరుగా ఉండేది. గత మార్చిలో దీన్ని 12 వరకు పెంచారు.