కొత్త ఏడాదిలో టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ భయాలు కొనసాగుతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరంలోనే ఎక్కువమంది టెక్కీలు ఉద్యోగాలను కోల్పోతున్నారు. Layoffs.fyi డేటా ప్రకారం, 2023వ సంవత్సరంలో మొదటి 15 రోజులలోనే 91 కంపెనీలు 24,000 మంది టెక్ ఉద్యోగుల (Tech Employees)ను తొలగించాయి. దీనర్థం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 1,600 మంది టెక్ వర్కర్లు ఉద్యోగాలను కోల్పోయారు.
* ఈ సంస్థలలో భారీ కోతలు : సోమవారం రోజు దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ తన వర్క్‌ఫోర్స్‌లో 20% మందిని తొలగించింది. అంటే దాదాపు 500 మంది ఉద్యోగులు జాబ్ కోల్పోయారు. భారతదేశవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు ఉన్న షేర్చాట్కి ట్విట్టర్, గూగుల్, స్నాప్, టైగర్ గ్లోబల్ వంటి పెద్ద కంపెనీలు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం వీరిలో దాదాపు 2,300 మంది ఉద్యోగులు ఉన్నారు.
అయితే అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 500 ఉద్యోగుల తొలగింపు జరిగింది. 2023లో అమెజాన్, సేల్స్‌ఫోర్స్, కాయిన్‌బేస్, ఓలా వంటి కంపెనీలు తొలగింపులు చేపట్టాయి. Crypto.com దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను 20% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో Skit.ai వంటి కంపెనీలు కూడా ఈ నెలలోనే ఉద్యోగులను సాగనంపడం మొదలుపెట్టాయి. ఈ తొలగింపుల ద్వారా ప్రభావితమైన మొత్తం టెక్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 24,151కి చేరుకుంది.
* ఉద్యోగాల కోసం పెరిగిన వేట : అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం, ఆర్థిక మాంద్యం భయం కారణంగా, అనేక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని డబ్బు ఆదా చేసుకుంటున్నాయి. కంపెనీలు ఒకేసారి కొలువులను పీకేస్తుండగా చాలా మంది ముందు జాగ్రత్తగా ఉద్యోగ అవకాశాలు, జాబ్ సెక్యూరిటీ కోసం లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను రీచ్ అవుతున్నారు.