జ్యోతిష్య శాస్త్రంలో పాప కర్తరి యోగం అంటే ఒక రకమైన బంధన యోగం. దీన్నే పాపార్గల యోగం అని కూడా అంటారు. లగ్నానికి అటూ ఇటూ అంటే 12, 2 రాశుల్లో పాప గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. లగ్నానికి రెండు వైపులా శుభగ్రహాలు ఉంటే దానిని శుభ కర్తరి యోగం అని అంటారు. శని, రాహు, కేతు, కుజ, రవి గ్రహాలను పాప గ్రహాలు అంటారు. ఈ పాప కర్తరి యోగం వల్ల జాతకుల జీవితాల్లో చిత్రవిచిత్రమైన, అనూహ్యమైన, అంతుబట్టని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒక విధంగా ఇది గృహ నిర్బంధ యోగం అని చెప్పవచ్చు.
ప్రధాన లక్షణాలు : జాతకంలో ఇటువంటి పాప కర్తరి యోగం ఉన్నవారు ఎంత ప్రతిభ ఉన్నా ఇంటికే పరిమితం అవుతుంటారు. వారి అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగం లభించడం కష్టం అవుతుంది. ఒకవేళ ఉద్యోగం లభించినా వారికి తగ్గట్టుగా వేతన భత్యాలు చేతికి అందవు. సాధారణంగా అనేక కుటుంబాలలో భార్యను భర్త బయటకి తీసుకువెళ్లడం అంటూ ఉండదు. దీనికి కారణం భార్య జాతకంలో పాప కర్తరి యోగం ఏర్పడి ఉండటమే. ఇంటికే అంకితమైన లేదా ఇంటికే పరిమితమైన వ్యక్తుల జాతకాలలో ఈ పాప కర్తరి కనిపిస్తుంది. మధ్య మధ్యలో పోవడం, నష్టాలు రావడం, అనారోగ్యాలు పీటించడం వంటివి కూడా జరుగుతుంటాయి. సాధారణంగా ఈ యోగం జీవితాంతం ఏదో రూపంలో పీడిస్తూ ఉంటుంది. కళ్లకు కూడా సమస్యలు తీసుకువస్తుంది. నేత్ర సంబంధమైన రోగాలు, అంధత్వానికి కూడా ఇది కారణం అవుతుంది.
యోగ భంగాలు : లగ్నానికి అటూ ఇటూ పాపగ్రహాలు ఉన్నప్పటికీ ఒక్కోసారి పాప కర్తరి యోగం పట్టకపోవడానికి అవకాశం ఉంది. లగ్నానికి రెండువైపులా ఉన్న పాప గ్రహాల మీద శుభగ్రహాల దృష్టిపడినప్పుడు ఈ యోగం భంగం అవుతుంది. ఈ పాప గ్రహాలతో శుభగ్రహాలు కలిసినప్పుడు కూడా యోగ భంగం జరుగుతుంది. అంతేకాక లగ్నం మీద శుభగ్రహాల దృష్టి పడినా లేక లగ్నాధిపతి బలంగా ఉన్నా ఈ యోగం ఫలించదు. జాతక చక్రంలో గజకేసరి యోగం ఉన్న పక్షంలో ఈ యోగం పనిచేయదు. చంద్రుడు నుంచి ఒకటి నాలుగు ఏడు పదో స్థానాలలో గురు గ్రహం ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. శుభగ్రహాల దశలు జరుగుతున్నప్పుడు ఈ పాప కర్తరి యోగం చాలా తక్కువ స్థాయిలో మాత్రమే పనిచేస్తుంది.
ఎప్పుడు పని చేస్తుంది? : సాధారణంగా పాప కర్తరియోగం జీవితాంతం ఏదో ఒక విధంగా జాతకుడికి సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ పాప గ్రహాలకు సంబంధించిన దశలు లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఈ యోగం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. శుభగ్రహాల దశలు లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రం ఈ యోగం చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. నిజానికి ఈ యోగం వల్ల కలిగే సమస్యలు సాధారణ సమస్యలే అయినప్పటికీ ఇది పెట్టే ఇబ్బందులు విపరీతమైన చికాకులు కలగజేస్తాయి.
ముఖ్యమైన పరిహారాలు : జాతక చక్రంలో పాప కర్తరి యోగం కలిగి ఉన్న జాతకులు ఎక్కువగా వినాయకుడిని పూజించడం వల్ల ఈ యోగం చాలావరకు భంగం అవుతుంది. పాపగ్రహాల దశలు జరుగుతున్నప్పుడు ఎక్కువగా వినాయకుడిని స్తోత్రం చేయడం మంచిది. వీలైనప్పుడు అన్నదానం చేయటం వల్ల తప్పకుండా శుభఫలితాలు అనుభవానికి వస్తాయి. అంతేకాక పుష్యరాగం అనే రాయిని ఉంగరంలో పొదిగి ధరించడం వల్ల కూడా.. ఈ యోగం చాలావరకు భంగం అవుతుంది.