జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతక చక్రంలో గురువు-శని, గురువు-రాహువు లేదా గురువు-కేతువు కలిసినప్పుడు గురు చండాల యోగం ఏర్పడు తుంది. జ్యోతిష శాస్త్రంలో గురువును ఒక పవిత్ర గ్రహం కింద భావించడం జరుగుతుంది. గురువు (Jupiter) ఒక శుభగ్రహం కూడా. ఈ గురు గ్రహానికి పాపగ్రహం అంటే శని, రాహు లేదా కేతువు తోడైనప్పుడు అది గురు చండాల యోగం అవుతుంది. దీనివల్ల గురు గ్రహ లక్షణాలు దెబ్బతింటాయి. దీనికి కూడా పాప గ్రహ లక్షణాలు సంక్రమిస్తాయి.
ఈ యోగం ఫలితాలు : గురు చండాల యోగానికి ఉన్న ప్రధాన లక్షణం ఏమిటంటే ధర్మ భ్రష్టత్వం అని... బృహజ్జాతకం అనే ప్రామాణిక జ్యోతిష గ్రంథం చెబుతోంది. వ్యక్తిగత జాతక చక్రంలో గురు చండాల యోగం ఉన్న జాతకుడు సాధారణంగా సాంప్రదాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుల లేదా మత నిబంధనలను, కట్టుబాట్లను వ్యతిరేకిస్తాడని కూడా చెబుతోంది.
ఈ యోగం ఉన్న జాతకులు... అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదనలు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు. అంతేకాక, ఏదో విధంగా ఏ మార్గంలోనైనా డబ్బు సంపాదించాలనే తపన, తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అది సక్రమ మార్గమా లేక అక్రమ మార్గమా అన్నది వీరికి పట్టదు. అవినీతికీ, లంచగొండితనానికి పాల్పడే వారి జాతకాలలో ఈ యోగం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
సంతాన సమస్యలు : నిజానికి ఈ లక్షణాలన్నీ వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ స్థూలంగా చెప్పాల్సిన లక్షణాలు మాత్రమే. వీటికి అనేక మినహాయింపులు కూడా ఉంటాయి. ఇక ఈ యోగం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. సంతానం కలగకపోవడం, అంగవైకల్యంతో సంతానం కలగటం, సంతాన నష్టం, సంతానానికి సంబంధించి సమస్యలు తలెత్తడం, పిల్లల్లో క్రమశిక్షణ లేకపోవడం, చదువుకునే వయసులో దారి తప్పడం వంటివి కూడా జరుగుతుంటాయి.
ఫలితాలు ఎప్పుడు ఉంటాయి? : జాతక చక్రాన్ని బట్టి గురు దశ లేక అంతర్దశ జరుగుతున్నప్పుడు ఇటువంటి ఫలితాలు అనుభవానికి వస్తాయి. గురువుతో కలిసి ఉన్న పాప గ్రహానికి సంబంధించిన దశలు లేదా అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా గురు చండాల యోగ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. గురువు ఏఏ స్థానాలకు అధిపతి అన్నదాని మీద కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, జాతక చక్రం ప్రకారం గురువు దశమాధిపతి అంటే... ఉద్యోగ స్థానాధిపతి అయిన పక్షంలో ఉద్యోగ పరంగా అవినీతికి పాల్పడటం జరుగుతుంది. ఈ గురు చండాల యోగం ఏ రాశిలో, ఎన్నో స్థానంలో చోటు చేసుకుందో దానిని బట్టి కూడా ఫలితాలలో మార్పు ఉంటుంది.
కొన్ని సానుకూల లక్షణాలు : ఈ యోగం వల్ల అంతా చెడే జరుగుతుందని అనుకోకూడదు. ఈ ఆధునిక కాలంలో గురు చండాల యోగం వల్ల ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాలలో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల ఈ రంగాలకు చెందిన నిపుణులు అద్భుతంగా రాణించడం జరుగుతుంది. ఈ రంగాలకు చెందిన విద్యార్థులకు లేదా ఉద్యోగులకు చక్కని అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. ఈ యోగం ఉన్న జాతకులలో శాస్త్రీయ దృక్పథం , తార్కిక ధోరణి బాగా పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యమైన పరిహారాలు : జాతక చక్రంలో ఈ యోగం ఉన్న పక్షంలో దీని పరిహారానికి ఎక్కువగా దుర్గాదేవిని లేదా వినాయకుడిని అర్చించడం శ్రేయస్కరం. అంతేకాక, పుష్యరాగంతో ఉంగరం ధరించడం కూడా మంచిది. మధ్య మధ్య అన్నదానం చేయించడం వల్ల కూడా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ జాతకులు ఎక్కువగా సానుకూల దృక్పథంతోనే అంటే పాజిటివ్ గానే ఆలోచించడం అవసరం. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)