ఉగాది... మన తెలుగింటి తొలి పండగ. ఈ పండగతోనే.. తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండగ అయింది. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే.
అయితే ప్రతీ పండగకు ప్రత్యేకతలు ఎలా ఉంటాయో.. ఆయా రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు.. అసలు ఏ మాత్రం చేయకూడని పనులు కూడా ఉంటాయి. మన పెద్దలు పండితులు పండగ పూట చేయాల్సిన పనులు.. చేయకూడని పనుల గురించి మనకు చెబుతుంటారు. అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయడం మంచిది కాదని చెబుతున్నారు పండితులు.
వీటితో పాటు పండగరోజు కొన్ని పనులు చేయడం వల్ల కూడా మంచి కలుగుతుందని అంటున్నారు. ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు. దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు. ఇక కొత్తబట్టలు, కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు మామూలే.