Navaratri 2020: దేశవ్యాప్తంగా కనక దుర్గ అమ్మవారు అష్టమి నాడు ప్రత్యేక పూజలందుకుంటున్నారు. నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించడం మనకు తెలుసు. అందులో భాగమైన ఎనిమిదో రోజు... అష్టమినాడు... అమ్మవారిని 108 ఎర్ర కలువలతో పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఒకే రోజు 108 ఎర్ర కలువలతో పూజ చేయలేకపోతే... వరుసగా నాలుగు రోజులపాటూ... అదే పూజ చేస్తూ... రోజూ కొన్ని కొన్ని ఎర్ర కలువలను అమ్మవారి కాళ్ల దగ్గర పెట్టి ప్రార్థిస్తారు. అసలు ఈ ఎర్ర కలువలే ఎందుకు? ఎన్నో పూలు ఉండగా... ఎక్కడో చెరువుల్లో... అరుదుగా కనిపించే ఎర్ర కలువలతోనే ఎందుకు పూజ చేస్తారంటే... దానికో ప్రత్యేక కారణం, పరమార్థం ఉన్నాయి.
ఈ ఎర్ర కలువలపై కృత్తివాసీ రామాయణంలో వివరాలు ఉన్నాయి. ఓ రోజు శ్రీరామచంద్రమూర్తి... ఓ సముద్రం ఒడ్డున ఉన్నారు. అమ్మవారికి పూజ చేస్తున్నారు. అదే సమయంలో... విభీషణుడు కూడా వచ్చి పూజలో పాల్గొన్నాడు. ఆ సమయంలో... రామబంటు అయిన ఆంజనేయస్వామి... ఎర్ర కలువ పూలను తీసుకొచ్చారు. వాటితో పూజ చేయడం ద్వారా... అమ్మవారు మరింత ఎక్కువ సంతోష పడతారని శ్రీరామచంద్రస్వామి భావిస్తూ... వాటితో పూజ చేశారు.
హనుమంతుడు మొత్తం 108 ఎర్ర కలువలను తీసుకొచ్చినట్లు తెలిసింది. వాటితో పూజ చేస్తూ... శ్రీరాముడు... అమ్మవారి కాళ్ల దగ్గర ఎర్ర కలువలను ఉంచి... తన కళ్లను త్యాగం చేసేందుకు (అర్పించేందుకు) సిద్ధమయ్యారట. అంతలోనే అమ్మవారు... ప్రత్యక్షమై... రామచంద్రస్వామి కోరిన కోరిక తీరుతుందనీ, విజయోస్తు అని చెప్పినట్లు తెలిసింది.
కాళిక పురాణంలో మరో కథ ఉంది. ఓ వ్యక్తి అమ్మవారిని పూజిస్తూ... 108 ఎర్ర కలువలను అమ్మవారి కాళ్ల దగ్గర ఉంటాడట. మరు జన్మలో అతడు మహారాజుగా జన్మించాడట. అందువల్ల ఎర్ర కలువలతో పూజిస్తే... అమ్మవారి కరుణా కటాక్షాలు మరింత ఎక్కువగా తమపై ప్రసరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పూజతో కోరికలు తప్పక తీరుతాయని నమ్ముతున్నారు.