సంక్రాంతి అంటేనే… కొత్త కాంతి అని అర్థం. మన జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చేది ఈ పండుగ నుంచే. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంగా 3 రోజుల పాటూ జరుపుకునే పండుగ సంక్రాంతి. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ. కొన్ని చోట్ల నాలుగో రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
సంక్రాంతి పండుగ రోజున తెలుగు లోగిళ్లన్నీ ముగ్గులతో కళకళలాడుతాయి. బంధువులు, చుట్టాలతో ఇళ్లలో సందడిగా ఉంటుంది. సంక్రాంతికి కొత్త అళ్లుళ్ల రాక మరో శోభ. కొత్త బట్టలు, పిండి వంటలు, అందరూ కలిసి పూజలు చేయడం, అందరూ కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం… అదంతా మాటలకు అందని ఆనందం. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతిని జరుపుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
సంక్రాంతి రోజున సూర్య దేవుడికి పూజలు చేస్తారు. పండుగ రోజున ఉదయాన్నే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ రోగాలూ, పాపాలూ వదిలిపోతాయని నమ్ముతారు. గంగానది దగ్గర్లో లేనప్పుడు… ఏదైనా చెరువులో కూడా స్నానం చేయవచ్చు. అలాగే సంక్రాంతి రోజున ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. మీరు పారేసే చెత్తతోనే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ కూడా బయటకు పోతుంది. కాబట్టి… భోగి నాడే తుక్కంతా బయట పారేసేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)