చాలామంది ఆంజనేయ స్వామి దండకాన్ని పారాయణం చేసి దిండు కింద పెట్టుకుని.. అలాగే నిద్రపోతుంటారు. అలా చేస్తే ఏ దుష్ట శక్తులు దరిచేరవని వారి నమ్మకం. కానీ అలా పుస్తకాన్ని దిండు కింద పెట్టుకోవడం అపచారమట. ఇక దేవుడి ఫొటోలను, దేవుడి బిళ్లలను తల కింద పెట్టుకుంటారు. నిద్రలేవగానే కళ్లకు అద్దుకునేందుకు ఇలా చేస్తుంటారు.
ఉదయాన్ని నిద్ర లేచి దేవుడి ఫొటోలను చూస్తే మంచిదని భావిస్తుంటారు. కానీ అలా దేవుడి ఫొటోలను తల కింద పెట్టుకుని నిద్రించడం కూడా దోషభూయిష్టమట. మంచం ఎప్పటికీ యోగ స్థానం తప్ప ఐశ్వర్య స్థానం కాదు. అందువల్ల వాటిని మంచం మీద పెట్టడం తప్పు. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే సంపద ఎల్లవేళలా ఇంట్లో ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పసుపు, కుంకుమలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. మంచానికి భోగ స్థానం అని పేరు. అందుకే ఎప్పుడూ పసుపూకుంకుమ, ఇతర పూజా ద్రవ్యాల్ని మంచంపై పెట్టకూడదు. తమలపాకులు, పూలు, పండ్లు, అవి పెట్టిన కవర్లు తీసుకొచ్చి మంచం మీద పెట్టకూడదు. దేవతలకు నైవేద్యం పెట్టడం కోసం తెచ్చుకున్న పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదట.
పూజ గది శుభ్రం చేసే సమయంలో చాలామంది అక్కడి దేవుడి ప్రతిమలను, ఫొటోలను మంచంపై పెడుతుంటారు. అలా చేయడం చాలా తప్పట. ఆ మంచంపై ఎన్నో అపవిత్ర కార్యాలను మనుషులు చేస్తుంటారని, దీంతో ఆ మంచంపై దేవుడి ఫొటోలను పెట్టడం వల్ల దైవాగ్రహానికి గురవుతారట. ఫలితంగా ఏ పని చేసినా కలిసిరాదట. ఏ కార్యం మొదలుపెట్టినా అది అసంపూర్తిగానే మిగిలిపోతుందట. సకల దరిద్రాలు పట్టుకుంటాయట. సంపద చేతిలో నిలవదట.
అంతేకాదు, కొందరు దేవుడి పటాలను తుడిచేందుకు పాత బట్టలను, ఏవి పడితే వాటిని వాడుతుంటారు. అలా చేయడం చాలా తప్పట. దేవుడి ఫొటోలను అలా తుడవటం వల్ల దైవాగ్రహానికి గురికాక తప్పదట. దేవుడి ఫొటోలను తుడిచే సమయంలో ప్రత్యేకంగా ఓ కొత్త గుడ్డను ఉపయోగించాలట. ఇలా మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంత కష్టపడినా కలిసిరాదట. అందుకే దైవ సంబంధిత విషయాల్లో కొంత అవగాహన కలిగి ఉండటం మంచిదని పెద్దలు చెబుతున్నారు.