శనీశ్వరుడి పేరు తలచుకుంటేనే చాలామందికి ముచ్చెమటలు పడతాయి. శని అంటే బాగా పీడించే గ్రహమని ఒక అభిప్రాయం స్థిరపడి పోయింది. అయితే.. జ్యోతిష్య శాస్త్రం శని గురించి ఇందుకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. ఇతర గ్రహాల మాదిరిగానే శని కూడా యోగాలను ఇస్తాడు. సుఖ సంతోషాలను కలగజేస్తాడు. ప్రశాంత జీవితాన్ని అందిస్తాడు. నిజానికి శని గ్రహం ఒక అల్పసంతోషి. ఒక టీచర్ లాంటివాడు. అనేక పాఠాలు నేర్పుతాడు. జాతకులను క్రమశిక్షణలో ఉంచుతాడు. కొన్ని రాశుల వారికి శని పాప స్థానాలకు అధిపతి అయినప్పటికీ.. చెడు ఫలితాల కంటే ఎక్కువగా మంచి ఫలితాలనే అనుగ్రహిస్తాడు. శని దోషం అనేది చాలా తక్కువ మంది జాతకాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని వివిధ రాశులకు ఏ విధంగా మంచి చేస్తాడో, ఏ విధంగా చెడు చేస్తాడో ఇక్కడ పరిశీలిద్దాం.
మేష రాశి (Aries) : ఈ రాశి వారికి శని 10, 11 వ స్థానాలకు అధిపతి. అంటే ఉద్యోగం, ఆదాయం, పురోగతి, స్థిరత్వం వంటి అంశాలు శని అధీనంలో ఉంటాయి. ప్రస్తుతం శని ఈ రాశి వారికి 11వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ పరంగా పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలోనే కాక ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది.
వృషభ రాశి (Taurus) : ఈ రాశి వారికి శని 9, 10 స్థానాలకు అధిపతి. భాగ్యం, విదేశీ ప్రయాణాలు, వృత్తి, వంటి ముఖ్యమైన అంశాలు శని అధీనంలో ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం శని ఈ రాశి వారికి పదో స్థానంలో సంచరిస్తున్నందు వల్ల ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందడం, గౌరవ మర్యాదలు పెరగటం, ఉద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి.
మిథున రాశి (Gemini) : ఈ రాశి వారికి శని 8, 9 స్థానాలకు అధిపతి. ఆయుర్దాయం, వారసత్వం, ఆకస్మిక ధన లాభం, భాగ్యస్థానం, విదేశీ ప్రయాణాలు వంటి అంశాలు శని చేతిలో ఉన్నాయి. ఈ రాశి వారికి శని ప్రస్తుతం 9వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. వారసత్వ సంపద చేతికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి (Cancer) : ఈ రాశి వారికి 7, 8 స్థానాలకు అధిపతి అయిన శని వీరికి వివాహం, ఆస్తి, సంపద, ఆయుర్దాయం వంటి అంశాలలో ఎంతగానో తోడ్పడతాడు. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలను చేపట్టే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
సింహ రాశి (Leo) : ఈ రాశి వారికి శని 6, 7 స్థానాలకు అధిపతి. అంటే ఉద్యోగం, సేవ, రుణాలు, శత్రువులు, వివాహం, భాగస్వామ్యం వంటి అంశాలు శని అధీనంలో ఉంటాయి. ప్రస్తుతం శని ఈ రాశికి ఏడో స్థానమైన కుంభరాశిలో అంటే స్వక్షేత్రంలో సంచరిస్తున్నందువల్ల ఈ అంశాలు సానుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. శత్రువులే మిత్రులవుతారు. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కన్య రాశి (Virgo) : ఈ రాశి వారికి శనీశ్వరుడు 5, 6 స్థానాలకు అధిపతి. సంతానం, ఆలోచనలు, ప్రణాళికలు, తీర్థయాత్రలు, రుణాలు, శత్రువులు, అనారోగ్యాలు వంటివి శనీశ్వరుడి ఆధీనంలో ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం శని ఆరవ రాశిలో అంటే స్వక్షేత్రమైన కుంభ రాశిలో సంచరిస్తున్నందువల్ల పైన చెప్పిన అంశాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. పిల్లలు లేని వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉంది. శత్రు రోగ రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తుల రాశి (Libra) : ఈ రాశి వారికి శనీశ్వరుడు 4, 5 స్థానాలకు అధిపతి. సుఖం, గృహం, , సంతానం, ఆలోచనలు, నిర్ణయాలు, ప్రణాళికలు వంటివి శని అధీనంలో ఉంటాయి. ఈ రాశి వారికి శని పూర్ణ శుభుడు. అందువల్ల సుఖసంతోషాలకు లోటు లేకుండా చేస్తాడు. గృహ యోగం, సంతాన యోగం, వాహనయోగం వంటివి కలిగిస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు చేసే ఆలోచనలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio) : ఈ రాశి వారికి శని 3, 4 స్థానాలకు అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు, ఇల్లు, వాహనం సుఖం తల్లి తదితర అంశాలు శని అధీనంలో ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం శని ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో సంచరిస్తు న్నందువల్ల గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లితో సత్సంబంధాలు ఏర్పడతాయి. తల్లి వల్ల ప్రయోజనాలు పొందుతారు.
ధనస్సు రాశి (Sagittarius) : ఈ రాశి వారికి శని 2, 3 స్థానాలకు అధిపతి. కుటుంబం, తోబుట్టువులు, ధనం, వాక్కు, ప్రయాణాలు వంటివి శని పర్యవేక్షణలో పనిచేస్తాయి. శని ప్రస్తుతం ఈ రాశి వారికి మూడో స్థానంలో సంచరిస్తున్నందువల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆదాయం లేదా సంపాదన ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.
మకర రాశి (Capricorn) : ఈ రాశి వారికి శని ఒకటి, రెండు స్థానాలకు అధిపతి. శని ద్వితీయ స్థానంలో సంచరిస్తు న్నందువల్ల సమాజంలో ఈ రాశి వారికి వ్యక్తిగత ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఒకటికంటే ఎక్కువ మార్గాలలో ధన సంపాదనకు అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధికి, గుర్తింపునకు అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius) : ఈ రాశి వారికి శని 12, 1 రాశులకు అధిపతి. అంటే వ్యక్తిగత విషయాలు, వ్యయం, చికిత్స, ప్రతిష్ట వంటివి శని అధీనంలో పనిచేస్తాయి. ప్రస్తుతం శని ఒకటో రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగతంగా పురోగతికి మార్గం సుగమం అవుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వైద్యం మీద చేస్తున్న ఖర్చు తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
మీన రాశి (Pisces) : ఈ రాశి వారికి శనీశ్వరుడు 11, 12 రాశులకు అధిపతి. ఉద్యోగంలో అభివృద్ధి, ఆదాయంలో పెరుగుదల, లాభాలు వంటివి శని అధీనంలో ఉండటం జరుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, ఆదాయపరంగా అభివృద్ధి ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు లేక తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది.
కొన్ని పరిహారాలు : ఇతర గ్రహాలకు భిన్నంగా శనీశ్వరుడు తాను ఏదో విధంగా సంతృప్తి చెందితేనే సత్ఫలితాలను అనుగ్రహిస్తాడు. ఏ సత్ఫలితం పొందాలన్నా తప్పనిసరిగా కష్టపడాల్సి ఉంటుంది. తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. శని ఏ పని నైనా ఆలస్యం చేస్తాడే కానీ ఇవ్వకుండా పోవడం అంటూ జరగదు. ఇక శనికి అహంకారం, మిడిసిపాటు, గర్వం వంటి లక్షణాలు నచ్చవు. ఇటువంటి వారికి శని యోగాలను ఇవ్వటం జరగదు.
వినయంగా, నిరాడంబరంగా, నిస్వార్ధంగా పనిచేసేవారంటే శని వారికి తప్పకుండా యోగాలను ఇస్తాడు. శనిని ఏ పరిస్థితులలోనూ ఏ విధంగానూ దూషించడం మంచిది కాదు. శనిని దూషిస్తే శని బలం పెరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి. శని శివుడి ఆజ్ఞను మాత్రమే పాటిస్తాడు. అందువల్ల శని దోషం ఉన్నవారు శివుడిని పూజించడం వల్ల ఈ దోషం చాలావరకు తగ్గుతుంది.