ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ నవరాత్రులను జరిపి.. ఆ అమ్మలగన్న అమ్మను నిష్టగా పూజిస్తారు. పదో రోజైన దశమి నాడు విజయదశమిని పండుగగా జరుపుకుంటారు. ఆ దుర్గమ్మను నియమనిష్టలతో పూజించి దేవీ కటాక్షం పొందాలనుకునే భక్తులు దసరా రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదట. దసరా రోజున పొరపాటున కూడా మాంసం ముట్టకూడదట. అలా పండుగ రోజు మాంసం భుజిస్తే నవరాత్రుల్లో దేవీ కృప కోసం చేసిన పూజా ఫలం దక్కదట.
అంతేకాదు.. అఖండ జ్యోతిని ఇంట్లో వెలిగించాలనుకుంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలట. జ్యోతిని వెలిగించి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోవడం అరిష్టమట. అదే విధంగా మాంసాహారంతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా దసరా రోజున వినియోగించకూడదట. నిమ్మకాయను కూడా కోయకూడదని పండితులు చెబుతున్నారు. వీటిలో ఏ ఒక్కటి చేసినా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు సూచిస్తున్నారు.
అలానే.. విజయదశమి రోజు పూజ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేస్తే అమ్మ వారి కటాక్షం ఆ కుటుంబానికి దక్కుతుందట. ఇక.. విజయదశమి రోజు చేయకూడని పనులు మాత్రమే కాదు కొన్ని చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. దసరా రోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. ఆ రూపంలో కనిపించే దుర్గమ్మ తల్లిని షోడశోపచారాలతో పూజిస్తే నవరాత్రుల పూజా ఫలం దక్కుతుందట.
చెడుపై మంచి విజయం సాధించిన రోజు. కావున.. ఏదైనా కొత్త వస్తువు కొనాలనుకునేవారు లేదా ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారికి ఈరోజు ఎంతో మంచి రోజు. ఇక.. విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించి.. పూజ తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు.. వార, నక్షత్ర, తిథి గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టే కార్యాలు సత్ఫలితాలను ఇస్తాయని అనాదిగా భక్తుల నమ్మకం.
అందువల్ల.. దసరా రోజున ప్రారంభించే ఏ శుభ కార్యమైనా విజయానికి బాట వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని పూజించిన శ్రీరాముడు విజయదశమి రోజునే రావణుడిపై విజయం సాధించినట్లు పెద్దలు చెబుతారు. అర్జునుడు కూడా విజయదశమి రోజునే అజ్ఞాతవాసం ముగించుకుని.. గాండీవం ధరించి.. అమ్మవారిని ప్రార్థించి ఉత్తర గోగ్రహణ యుద్ధంలో కౌరవులను ఓడించిన విషయాన్ని పెద్దలు గుర్తుచేస్తుంటారు.