గుజరాత్... సురేంద్రనగర్ జిల్లాలోని... రాజుదాన్ గధ్వీలో జరిగిందీ ఘటన. సురేంద్రనగర్ జిల్లాని హనుమాన్ జిల్లా అంటారు. ఎందుకంటే ఈ జిల్లాలో హనుమంతుడి ఆలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ వీధికి వెళ్లినా, ఏ సందులో చూసినా అంజనీ పుత్రుడి ఆలయం తప్పక ఉంటుంది. ఐతే... ఒక్కో ఆలయానికి ఒక్కో రకమైన పేరు ఉంటుంది. అందువల్ల కొత్తగా వెళ్లిన వారు... ఒకింత కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడి దేరీ ఖండీ పోల్ ఏరియాలో ఓ చిన్న హనుమాన్ ఆలయం ఉంది. అది వందేళ్ల నాటిది. ఈ ఆలయంపై భక్తులకు ఎంతో విశ్వాసం ఉంది. ఇక్కడకు వచ్చి కోరికలు కోరితే... ఆంజనేయుడు తప్పక తీర్చుతాడని నమ్ముతారు.
ఈ ఆలయం వెనక ఓ చెట్టు ఉంది. అది 90 ఏళ్ల నాటిది. తాజాగా ఆ చెట్టు కాండంపై ఆంజనేయస్వామి ఆకారం కనిపిస్తోంది. దాంతో దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో రాసాగారు. ఆంజనేయుడి ఆకారాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందెప్పుడూ అలా తాము చూడలేదని అంటున్నారు. స్వామి ఆకారానికి పూజలు చేసి... హారతులు ఇస్తున్నారు.
ఇదంతా ఆంజనేయస్వామి మహిమే అంటున్నారు భక్తులు. ఇప్పుడు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ... చెట్టుకి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. హేతువాదులు మాత్రం ఇందులో వింత ఏముంది అంటున్నారు. చెట్టు అలా పెరిగితే... దాన్ని కూడా ఆంజనేయ స్వామిగా చెప్పేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. భక్తులు మాత్రం... చూసే కళ్లను బట్టే ఏదైనా ఉంటుంది అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.