వ్యాపారంలో తేడా వస్తే భాగస్వాములు విడిపోతారు... దాని వల్ల పెద్దగా నష్టం రాకపోవచ్చు గానీ... వైవాహిక జీవితంలో భార్యభర్తలు విడిపోతే చాలా ఇబ్బంది. అది వారికే కాదు... వారి పిల్లలకు, రెండువైపుల కుటుంబాల వారికీ సమస్యే. అందుకే దంపతులు విడాకులకు అప్లై చేసుకున్నా... కోర్టులు త్వరగా ఇవ్వవు. ఎలాగొలా తిరిగి వారిని కలిపేందుకే ట్రై చేస్తాయి. ఐతే, మనుషులుగా మనం అందరం తప్పులు చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఒక్కో రాశి వారు చేసే ఒక్కో రకమైన తప్పుల వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఎవరు ఏ తప్పులు చేస్తారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries) : రాశుల్లో మొదటి రాశి అయిన మేష రాశి వారు చాలా స్పష్టమైన వైఖరి, నిజాయితీ కలిగివుంటారు. వీరిలో ఉత్సాహం ఎక్కువ. ధైర్యం చాలా ఉంటుంది. వీరిని కుజ (Mars) గ్రహం పాలిస్తుంది. అందువల్ల సహజంగానే వీరు వీరుల్లా ఉంటారు. ఈ కారణంగానే వీరు చాలా దురుసుగా కూడా ప్రవర్తిస్తారు. కోపం వచ్చినప్పుడు వీరు చెలరేగిపోతారు. తప్పంతా అవతలివారిదే అనేస్తారు. ఫలితంగా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. ఐతే... కోపం చల్లారాక వీరు అంతా ఆలోచించి... తప్పు నాదే అని గ్రహిస్తారు. తిరిగి సంబంధం పెంచుకుంటారు. ఐతే... ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యమైనా... దాంపత్య జీవితం కల్లోలం అవుతుంది. అందువల్ల మేష రాశి వారు తమ దూకుడును కంట్రోల్లో ఉంచుకోవాలి.
వృషభ రాశి (Taurus) : వృషభరాశి వారు కష్టపడతారు. బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు. ఆ క్రమంలో వారు కాస్త మొండిగా మారతారు. అక్కడే సమస్య వస్తుంది. జనరల్‌గా ఈ రాశి వారు ఏ వ్యవస్థనైనా బాగా నడిపించగలరు. చేసే పనిని గర్వంగా చేస్తారు. లక్ష్యాలకు కట్టుబడి ఉంటారు. ఆ క్రమంలో వీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. దాని వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయన్నది ఆలోచించరు. పని అవ్వడమే ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే టార్గెట్ టైమ్ అయిపోతూ ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత టైమ్ ఉండదు. ఐతే... ఈ తీరు అన్నిసార్లూ మంచిది కాదు. ఈ రాశి వారిని భరించే వారిలో ఏదో ఒక రోజున సహనం తగ్గిపోతుంది. అప్పుడు ఈ రాశి వారికి సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి పనిని పనిగా, ఫ్యామిలీని ఫ్యామిలీగా చూసుకోవాలి. రెండింటినీ మిక్స్ చెయ్యకూడదు. అప్పుడు అంతా హాయిగా ఉంటుంది.
మిథున రాశి (Gemini) : మిథన రాశి వారు చురుకైన వారు. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి గుర్తులో కవలలు ఉంటారు. అందువల్ల వీరు ఒకే సమయంలో రకరకాల ఆలోచనలు కలిగివుంటారు. ఒక్కోసారి గందరగోళం తప్పదు. వీరిది అగ్ని రాశి కావడంతో... దూకుడుమీద ఉంటారు. ఎవరితోనూ పూర్తిగా కలవలేరు. మాటిమాటికీ ఫ్రెండ్స్‌ని మార్చేస్తూ ఉంటారు. దేనికీ ఫిక్స్ అవ్వలేరు. వీరికి చుట్టూ ఆప్షన్లు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏదీ ఫైనల్ కాదు. ఎంతో టాలెంట్ ఉండి, అన్ని రంగాల్లోనూ ప్రవేశించగలిగి కూడా... సంబంధాల్ని స్థిరంగా కొనసాగించడంలో వీరు ఫెయిలవుతుంటారు. వీరు కాకపోతే వారు అనే ధోరణి సమస్యగా మారుతుంది. మానవ సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి... ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి (Cancer) : జల రాశి అయిన కర్కాటక రాశి వారిని చంద్రుడు పాలిస్తాడు. వీరు బాగా ప్రేమిస్తారు, సున్నిత మనస్తత్వంతో ఉంటారు. అలాగే చందమామకు మచ్చలున్నట్లే... కర్కాటక రాశి వారు కూడా చంచలమైన స్వభావంతో ఉంటారు. వీరి మూడ్ ప్రశాంతం నుంచీ గంభీరానికి మారిపోగలదు. తమకు ఆపద వస్తోంది అని గ్రహించినప్పుడు ఇదే కర్కాటక రాశి వారు అత్యంత కఠోరంగా మారి భీకరంగా ఎదురుతిరగగలరు. అలా ఎదురు తిరిగినప్పుడు వీరి కోపం కంట్రోల్ లేకుండా ఉంటుంది. అవతలి వారు తట్టుకోలేరు. అందువల్ల కర్కాటక రాశి వారు ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలి. ప్రశాంతతే వారి బలం.... దాన్ని కొనసాగించాలి. ఆవేశాలకు ఛాన్స్ ఇవ్వకూడదు.
సింహ రాశి (Leo) : ప్రేమ, దయ, జాలి అన్నీ చూపించగల రాశి సింహ రాశి. భాగస్వామి పట్ల పూర్తి పాజిటివ్ ఎనర్జీని వీరు ఇస్తారు. ఐతే... ఈ రాశి వారిని భాగస్వామి పట్టించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం సింహ రాశి వారు అస్సలు సహించలేరు. ఆగ్రహంతో రగిలిపోతారు. ఆ తర్వాత భాగస్వామిని దూరం పెట్టగలరు. గర్వం, అహంకారం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించగలరు. ఐతే... ఈ మొండి పట్టుదల వల్ల వైవాహిక జీవితం, మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆగ్రహావేశాలకు ఛాన్స్ ఇవ్వకుండా... అదే ప్రమ, జాలి, దయ కురిపిస్తూ ఉంటే... సింహ రాశి వారి సాన్నిహిత్యం అత్యద్భుతంగా ఉంటుంది.
కన్య రాశి (Virgo) : అత్యంత తెలివైన, అత్యంత పరిశీలనాత్మక ధోరణి కలిగివుంటారు కన్య రాశి వారు. ప్రతీదీ బాగా అబ్జర్వ్ చేస్తారు. లాజికల్‌గా ఆలోచించడంలో వీరికి తిరుగులేదు. వీళ్లు సైలెంట్‌గా ఉన్నారంటే... మైండ్‌లో లోతుగా ఏదో ఆలోచిస్తున్నట్లే. ఈ లక్షణాలు వీరికి ప్లస్ పాయింట్. ఇవే లక్షణాలు ఒక్కోసారి మైనస్ పాయింట్లు కూడా అవుతాయి. భాగస్వామిపై ఉత్తినే అనుమానం వ్యక్తం చేస్తారు. తమలో తాము ఏదేదో ఊహించేసుకొని... అలా అయ్యుంటుంది అనేసుకుంటారు. ఆ క్షణంలో... గబుక్కున ఓ మాట అనేస్తే... అవతలి వారి మనస్సు చివుక్కుమంటుంది. అంతే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి... ప్రతీదీ లోతుగా ఆలోచించేయకుండా... అవతలి వారిని నమ్మడంపైనే ఫోకస్ పెడితే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
తుల రాశి (Libra) : తుల రాశి వారు ప్రతీదీ బ్యాలెన్స్ చేసుకుంటారు. జీవితంలో అందరి ప్రేమాను రాగాలనూ పొందుతారు. అందరికీ వాటిని సమానంగా పంచుతుంటారు. మానవ సంబంధాల్ని బలంగా పట్టి ఉంచుకోవడంలో వీరికి తిరుగులేదు. ఐతే... ఇక్కడో సమస్య ఉంది. ఎప్పుడైనా వివాదం తలెత్తినప్పుడు... వీరు రెండవైపులా మొగ్గు చూపుతూ... రెండువైపుల వారికీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా... ఏది కరెక్టో అటు మద్దతిస్తూ... తప్పున తప్పు అని చెప్పడానికి వెనకాడకూడదు. అప్పుడే ఈ రాశి వారు స్థిరంగా ముందకెళ్లగలరు. అన్నీ సార్లూ బ్యాలెన్సింగ్ అనేది సెట్ కాదు. ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టి... న్యాయం, ధర్మాన్ని లెక్కలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి (Scorpio) : వృశ్చిక రాశి వారి తీరు చాలా చిత్రంగా ఉంటుంది. పైకి మొండిగా, దూరం దూరంగా ఉంటారు. లోలోపలేమో అత్యంత ప్రేమ, ఎమోషన్, భావోధ్వేగాలతో ఉంటారు. అవతలి వారికి వీరు అంత త్వరగా అర్థం కారు. ఈజీగా ర్యాపో మెయింటేన్ చెయ్యరు. తమ మనసులో ఏముందో బయటకు చెప్పరు. అందువల్ల వీరిని ఎవరైనా సరే త్వరగా అర్థం చేసుకోలేరు. దానికి తోడు వృశ్చిక రాశి వారు పవర్ చూపించగలరు. ఇతరుల్ని తమ కంట్రోల్లో ఉంచుకోగలరు. మానవ సంబంధాలనేవి ఫ్రీగా ఉన్నప్పుడే బలపడతాయి. మొండిగా ఉంటే చిక్కుల్లో పడతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు... తీరు కొద్దిగా మార్చుకొని... స్నేహ, ప్రేమ భావాల్ని ప్రదర్శించాలి. జొవియల్గా ఉండేందుకు ప్రయత్నించాలని పండితులు సూచిస్తున్నారు.
ధనస్సు రాశి (Sagittarius) : ధనస్సు రాశి వారు ఓ అంశంలో మిగతా అన్ని రాశుల కంటే పూర్తి భిన్నం. వీరు ఒకే చోట ఎక్కువ కాలం ఉండలేరు. కొత్త ప్రదేశాలు చూడాలనీ, ప్రపంచాన్ని చుట్టేయాలని కోరుకుంటారు. స్థిరమైన అభిప్రాయాలు వీరికి అస్సలు ఉండవు. రోజురోజుకూ అవి మారిపోతూ ఉంటాయి. మానవ సంబంధాలపై వీరికి అంతగా ఆసక్తి ఉండదు. ప్రపంచమంతా మనదే అనుకుంటూ విహరించాలనుకుంటారు. పైగా ఈ విషయంలో రాజీ పడటాన్ని వారు ఇష్టపడరు. తాము బంధీ అయిపోతున్నట్లు భావిస్తారు. అందువల్ల ఈ రాశి వారితో సంబంధాలు నెరిపేవారు... ఇలాంటి ఆలోచనలు కలిగివుంటే... బాగుటుంది. లేదంటే... ఇబ్బందులు తప్పవు అంటున్నారు పండితులు.
మకర రాశి (Capricorn) : మకర రాశి వారు సీరియస్‌గా ఉంటారు. పని రాక్షసులు. వీరిని శనిగ్రహం పాలిస్తుంది. వీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వీరు సంబంధాల్ని దీర్ఘకాలం కొనసాగిస్తారు. ఐతే... పని ఒత్తిళ్ల వల్ల వీరు సంబంధాల్ని కొనసాగించేటప్పుడు అవతలి వారితో అంతగా సరదాగా ఉండలేరు. అనుక్షణం టార్గెట్లు వీరిని నడిపిస్తూ, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పనిలో పడి ఫ్యామిలీ, తన వారిని అంతగా పట్టించుకోలేరు. వీరి కష్టాన్ని ఇష్టపడేవారు తోడుగా వస్తే... జీవితం హాయిగా ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా... అవతలి రాశి వారి మనస్తత్వాన్ని బట్టీ వ్యవహరించాలి లేదంటా మకర రాశి వారికి జీవితం సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది.
కుంభ రాశి (Aquarius) : కుంభ రాశి వారిలో విప్లవ భావాలుంటాయి. సమాజాన్ని కాపాడాలి, ఉద్ధరించాలి అనుకుంటారు. సమాజంలో ఏదో అయిపోతోంది అయ్యో అని టెన్షన్ పడతారు. ఇలా అందర్నీ పట్టించుకునే క్రమంలో... సొంత కుటుంబం, సొంత వాళ్లను పట్టించుకోలేరు. అదే సమస్య అవుతుంది. ప్రేమంతా ప్రపంచానికే పంచేయకూడదు. తమనే నమ్ముకున్నవారికి, భాగస్వామికి కూడా పంచాలి. మానవ సంబంధాలు సున్నితమైనవి కాబట్టి... నా అనేవాళ్లను దృష్టిలో పెట్టుకొని మెలగాలి. ఆదర్శ భావాలు, ప్రపంచ సమస్యల్ని నెత్తినేసుకునే ఉద్దేశం భాగస్వామికి లేకపోతే... కుంభ రాశి వారికి సమస్యలు తప్పవు. అందువల్ల ఈ రాశి వారు ఇంట్లో వాళ్ల పట్ల కూడా బాధ్యతతో ఉండాల్సిందే.
మీన రాశి (Pisces) : రాశుల్లో కర్కాటక రాశి తర్వాత అంతటి సెన్సిటివ్ రాశి మేష రాశి. నిజానికి ఈ రాశి వారు మానవ సంబంధాల్ని అద్భుతంగా కలిగివుంటారు. వీరితో ఉంటే ప్రతీక్షణం మిస్టరీగా, థ్రిల్లింగ్‌గా, ఏదో మాయలా ఉంటుంది. ఐతే... వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మేష రాశి వారికి మనసులో రంగుల కలల ఊహా ప్రపంచం ఒకటి ఉంటుంది. వీరి తరచూ అందులోకి వెళ్లిపోయి విహరిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీరు వాస్తవ ప్రపంచాన్ని అంతగా ఇష్టపడలేరు. అలా కాకుండా... భాగస్వామికి కూడా ఆశలు, ఆనందాలు ఉంటాయని గ్రహించాలి. ఏం చేసినా భాగస్వామితో కలిసి చెయ్యాలి. అప్పుడు అందరూ కలల ప్రపంచంలో విహరించినట్లు అవుతుందని పండితులు సూచిస్తున్నారు.