MLA Roja: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అవకాశం ఉన్న ప్రతిసారి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడతారు. ఆమెలో దైవ చింతన ఎక్కువగానే కనిపిస్తుంది. తాజాగా ఎమ్మెల్యే రోజా సమతామూర్తి భగవత్ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించారు. సంప్రదాయ చీరలో స్వామి విగ్రహాన్ని దర్శించుకుని.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రాన్ని తయారు చేశారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలను రాపిడి చేసి బాలాగ్నిని రగిలించారు. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండలాలకు తీసుకెళ్లారు. యాగశాలను 114 శాలలుగా విభజించి హోమాలను చేశారు. శ్రీరామనగరంలో నేలపై 5 వేల మంది రుత్విజులు యాగం చేయడం ఇదే తొలిసారని వేద పండితులు చెబుతున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అయోధ్య, నేపాల్, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని జీయర్ స్వాములు హాజరై శ్రీలక్ష్మినారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. యాగశాలకు కుడివైపు భాగాన్ని శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా భోగ మండపం, మధ్య భాగాన్ని తిరుమల క్షేత్రానికి గుర్తుగా పుష్ప మండపం, వెనుక వైపు ఉన్న భాగాన్ని కాంచిపురానికి గుర్తుగా త్యాగ మండపం, ఎడమ వైపు ఉన్న మండపాన్ని మేలుకోట కేత్రంగా భావిస్తూ జ్ఞాన మండపంగా నామకరణం చేశామన్నారు చిన్నజీయర్ స్వామి.
ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు. కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు. ఆ మహానుభావుడు అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భం.. మరో వెయ్యేళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టం శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ మహోత్సవం.