ప్రతి యేటా మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నారు. దీంతో పిచుకుల గురించి అవగాహన కలిపిస్తున్నారు. అంతేకాకుండా పిచుకులను ఎలా సంరక్షించాలో అవగాహన కల్పించటం కోసం చిత్రలేఖన పోటీలు, ఫ్లకార్డ్ చాలెంజ్, పిచ్చుకలను కాపాడడం ఎలా అన్న అంశంపై వర్క్ షాపులు నిర్వహించడం, పిచ్చుకల కోసం కృత్రిమ నివాసాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు..గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్ టవర్ కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి సంపద వల్ల ఆహారం కొరత వల్ల, వాతావరణంలో మార్పులు వచ్చి అవి అంతరించి పోతున్నాయి. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతలను కాపాడే పిచ్చుకలను కాపాడు కోవల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
ప్రపంచంలో సుమారు 35 రకాల జాతుల పిచ్చుకలు ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇంటి పిచ్చుక, స్పానిష్ పిచ్చుక, సింధ్ పిచ్చుక, సొమాలి పిచ్చుక, కేప్ పిచ్చుక, చిలుక ముక్కు పిచ్చుక, ఎడారి పిచ్చుక, చెట్టు పిచ్చుక, సూడాన్ బంగారు పిచ్చుక, అరేబియన్ బంగారు పిచ్చుక, ఇటాలియన్ పిచ్చుక, ఆసియన్ ఎడారి పిచ్చుక తదితర జాతులు ఉన్నాయి.
ప్రగతిబాట పడుతున్న ప్రతిచోట సెల్ఫోన్ లేనివారు లేరంటే అతిశ యోక్తికాదు. కోట్లకొద్ది సెల్ఫోన్లు, వేలాది సెల్ టవర్లతో విడుదలయ్యే రేడియేషన్ కారణంగా పిచ్చుకులు చనిపోతున్నాయి. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ పక్షల మనుగడకు ముప్పులా పరిణమిస్తోంది. ఎక్కువగా బలవుతున్నవి కాకులు, గబ్బీలాలు, పిచ్చుకలే.