ముఖ్యంగా ఫస్ట్ వేవ్ తరువాత డెల్టా వేరియంట్ తో కరోనా ప్రజలను సెకండ్ వేవ్ రూపంలో భయభ్రాంతులకు గురిచేసింది. డెల్టా వేరియంట్ ఫస్ట్ వేవ్ కంటే 3 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను సైతం భయపెట్టింది. ఇటీవల సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి.
మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధించడంతో కరోనా అదుపులోకి వస్తోంది. మెళ్లిగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అయినా కరోనా భూతం అదుపులోకి రావడం లేదు. మరింత విరుచుకుపడుతోంది.
ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు, అధికారుల సూచనల మేరకు కరోనా కట్టడిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఈ వారం నుంచి వీకెండ్ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వలేదు.. ఇది కూడా కరోనా విస్తరణకు ఓ కారణం. ఆ విమర్శల నుంచి బయట పడాలి అంటే.. వీకెండ్ లాక్ డౌన్ అనివార్యమని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
విశాఖ విషయానికి వస్తే.. వీకెండ్స్ లో బీచ్ లకు, ఇతర సందర ప్రదేశాలకు భారీగా పర్యాటకులు వస్తున్నారు. వారి కారణంగా ఈ కేసులు రెట్టింపు అవుతున్నాయని అభిప్రాయం ఉంది. దీనిపై ఇప్పటికే అధికారులు నివేదికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందుకే రాష్ట్రం వ్యప్తంగా ఎలాంటి ఆంక్షలు ఉన్నా.. విశాఖలో మాత్రం ఈ వారం నుంచి వీకెండ్ లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం ఉంది.
ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య ఎలా ఉన్నా.. తిరుపతి నగరం నుంచి ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో.. ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలోనూ కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా అధికారులు కసర్తుత చేస్తున్నట్టు తెలుస్తోంది.