Polavaram Floods: పోలవరం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పోలవరం స్పిల్ వే దగ్గర 29.4మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఉదయానికి 12లక్షల క్యూసెక్కులకు పైగానే వరద వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు శ్రీరాంసాగర్ జలాశయం గేట్లూ ఎత్తడంతో గోదావరిలోకి అన్ని వైపులా ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రానికి పోలవరం స్పిల్ వే 48 గేట్లు ఎత్తారు. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటే.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. ఇవాళ ఉదయం వరకు 12 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం స్పిల్ వే దగ్గర 29 మీటర్లకుపైగా నీటి మట్టం ఉంది. జలాశయంలో 33 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు దిగువన అఖండ గోదావరి కుడి, ఎడమ గట్లను తాకుతూ నది ప్రవహిస్తోంది. పోలవరం దగ్గర పరిస్థితిని 3 రోజులు పరిశీలించేందుకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ జి.సూర్యనారాయణరెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం దగ్గర గోదావరి నీటి మట్టం సుమారు 8 అడుగులకు పైగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం పైభాగంలో ఉన్న పోశమ్మగండి దగ్గర ఇళ్లన్నీ నీటమునిగాయి. స్థానికులు సామగ్రితో పురుషోత్తపట్నం చేరుకున్నారు. ప్రస్తుతం గండి పోశమ్మ అమ్మవారి ఆలయ గోపురం వరకు వరద చేరే అవకాశాలు ఉన్నాయి.
పోచమ్మగండి- పి.గొందూరు గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారిపైకి నీరు చేరింది. మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఎగువ ప్రాంతాలైన కొండమొదలు పంచాయతీలోని కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు నిర్వాసితులూ అక్కడే ఉన్నారు. వారిని పునరావాస కాలనీలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
పోలవరం వద్ద గోదావరిలో వరద పెరుగుతుంటే.. మరోవైపు దిగువ కాఫర్ డ్యాం రక్షణకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దిగువ కాఫర్ డ్యాం వద్ద 19.750 మీటర్ల ఎత్తున నీరు ఉంది. దిగువ కాఫర్ డ్యాం ఎత్తును యుద్ధప్రాతిపదిక 24 మీటర్ల కన్నా ఎత్తు పెంచేందుకు ఏర్పాట్లు చేశామని జలవనరులశాఖ అధికారులు పేర్కొన్నారు.
దిగువ కాఫర్ డ్యాం దగ్గర 16 పొక్లెయిన్లు, 90 డంపర్లు, 5 డోజర్లు, 4 వైబ్రో కాంపాక్షన్ యంత్రాలతో పనులు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఒక వైపు వరద వస్తుంటే ఇప్పుడు పనుల హడావుడి ఏంటని విమర్శలు వస్తున్నాయి. ఈసారి మాత్రం 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు తీవ్ర ఆటంకం కలిగింది.
మరోవైపు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరదలు వస్తున్నాయి. ప్రస్తుతం దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాఫర్ ఢ్యాం, గ్యాప్-2పనులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 రేడియల్ గేట్ల వద్ద నీరు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై గేట్లు ఎత్తారు.
మూడు రోజులుగా వానల పడుతుండటంతో.. విపరీతంగా వరద వస్తోంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మిక భారీ వరద ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పనులకు ఆటంకాలు తప్పడం లేదు. భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి వరద
గతంలో జూలైలో 30 నుండి 50 వేల క్యూసెక్కుల మాత్రమే వచ్చే వరద. ఐతే ఈసారి మాత్రం 10లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది.