Vizag steel plant Protest: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరింత మారుమోగుతోంది. ఎక్కడ చూసినా సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ప్రతి గొంతు నినదిస్తోంది. ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఇకపై తీవ్ర తరం చేయాలని.. అవసరమైతే దానికి అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలని కార్మికులు నిర్ణయించారు.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తూ.. ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు 367వ రోజుకు చేరుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదంటూ… కొనసాగిస్తున్న నిరసన దీక్షలకు ఏడాది పూర్తయింది. దీంతో ఇవాళ కార్మిక సంఘాలు జైల్ భరోకు పిలుపు ఇచ్చాయి. జాతీయ రహదారిని దిగ్బంధించారు. జీవీఎంసీ నుంచి డాబా గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టారు. కార్మికుల ఉద్యమానికి సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎన్నో ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇది.. అని ఇంత గొప్ప చరిత్ర ఉన్న.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ఎలా ఒప్పుకుంటామన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా సంవత్సర కాలంగా కార్మికులు పోరాటం చేస్తోన్నారు. ఒక వైపు ఉత్పత్తిని పరుగులు పెట్టిస్తూనే, కర్మాగారాన్ని రక్షించుకునేందుకు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏడాదిగా నిర్వహిస్తోన్నారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పట్ల తమకున్న పట్టుదల, ఉక్కు కార్మికుల ఐక్యతను చాటే విధంగా వేలాది మందితో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
8,849 కోట్లతో 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఇన్ని ఘనతలు ఉన్న విశాఖ ఉక్కును కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం దీనికి సొంతగనులు కేటాయించకపోయినా కార్మికులు, ఉద్యోగుల శ్రమతో మరో 13 వేల కోట్ల వెచ్చించి 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరించిందని కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి.