Ganesh Chaturthi 2022: దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వినాయకుడి ఆలయాలైతే భక్తులతో పోటెత్తుతున్నాయి. వినాయక చవితి నాడు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో సంపత్ వినాయకుడి కోవెల ఒకటి.. వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకుని.. ఏదైనా మొక్కుకుంటే కచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.. ఇంతకీ ఈ ఆలయం ఎక్కవ ఉంది.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..
సకల విఘ్నాలను హరించి కోరినకోర్కిలు తీర్చే వేల్పుగా ఈ వినాయకుడు (Lord Vinayaka) ప్రసిద్ధి చెందాడు. ప్రతి రోజూ దాదాపు వేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్ వినాయక దేవాలయం.. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా ఈ ఆలయం విలసిల్లుతోంది.
ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) కి.. ఆర్టీసీ కాంప్లెక్స్ (RTC Complex) కు మధ్యలో 1962లో ఆశీలుమెట్ట ప్రాంతంలో టి.ఎస్.రాజేశ్వరన్, టిఎస్. సెల్వగణేశన్, ఎస్.జి. సంబంధన్లు కలిసి ఈ సంపత్ వినాయకుడు దేవాలయాన్ని నిర్మించారు. పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడి వినాయకుడికి పూజలు నిర్వహించేవారు.
ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఆలయానికి భక్తులకసంఖ్య పెరుగుతూ వచ్చింది. 1967లో కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ దేవాలయంలో శ్రీ గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత 1996లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. తర్వాత కాలక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లేదా గ్రూప్–1 అధికారి పర్యవేక్షించే ప్రముఖ దేవస్థానంగా ఆ ఆలయం ఎదిగింది.
విశాఖ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ప్రతి బుధవారం ఈ ఆలయానికి భక్తులతాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయం వద్ద గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా.. నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి. వేల సంఖ్యలో నిత్యం భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు.
వినాయక నవరాత్రి సమయాల్లో సంపత్ వినాయకుడు దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటే.. సమస్య ఏదైనా ఇట్టే తీరిపోతుందని నమ్ముతారు. అందుకే భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తుంటారు..
కేవలం వినాయక నవరాత్రుల సమయాల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో సైతం సంపత్ వినాయకుడిని ప్రతినిత్యం ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. గరిక పూజ, ఉండ్రాళ్ళ నివేదన, అభిషేకము, గణపతి హోమం, నిత్య పూజలు, వాహన పూజలు, ప్రతీ మాసంలో బహుళ చతుర్థినాడు జరిగే సంకష్టహర చతుర్థి పూజలతో ఆలయం శోభాయమానంగా విలసిల్లుతుంది. వినాయకుడు భోజనప్రియుడు అందుకే ప్రతి రోజు వివిధ రకాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు.
అంతేకాదు అభిషేకాలను చాలా వైభవంగా నిర్వహిస్తారు. గంధోదకం, హరిద్రోదకం, పెరుగు, ఆవుపాలు, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు, తేనే, శుద్ధోదకం, పంచధారలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం చూడటానికి భక్తులు పెద్దసంఖ్యలో క్యూ కడుతుంటారు. అభిషేకం అనంతరం స్వామివారికి చేసే అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ సంపత్ వినాయగర్ ఆలయంలో వాహన పూజకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. విశాఖ నగరంలో లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా కొత్త వాహనము కొనుగోలు చేస్తే తప్పకుండా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారు. అలా పూజ చేయించడం సర్వశుభప్రదమని..తమకు ఎలాంటి హానీ కలగదని భక్తుల నమ్మకం. అందుకే, ఈ ఆలయంలో వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.