P Anand Mohan, Visakhapatnam, News18. Jaggery: బెల్లమేస్తే ఇష్టం అని ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. కానీ అది నిజం.. చాలామందికి బెల్లం రుచి తగిలితేనే ఆ స్వీటు తిన్న ఫీలింగ్ వస్తుంది. మారుతున్న జీవన శైలి నేపథ్యంలో.. వైద్యులు సైతం పంచదార బదులు బెల్లం తీసుకోవడమే బెటర్ అని సూచిస్తుంటారు.. ఎందుకంటే మంచి పోషకాలున్న బెల్లంను మితంగా తింటే కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
టీ, కాఫీ, స్వీట్లు, డెజర్ట్సు, జ్యూసుల్లో బెల్లాన్ని వాడటం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెల్లంలోని పోషకాలు రక్తహీనత వంటి వాటిని అధిగమించేలా చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే స్వచ్ఛమైన నల్ల బెల్లంను ఎంపిక చేసుకోవడమే ముఖ్యంగా.. అలాంటి స్వచ్ఛమైన బెల్లం దొరికే ప్లేస్.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి ఒకటి.
అనకాపల్లి బెల్లం ఎంత ఫేమస్ అన్నది చాలామందికి తెలుసు.. అయితే బెల్లంతో ఉన్న ప్రయోజనాలు తెలిసిన తరువాత ఇక్క బెల్లానికి డిమాండ్ పెరగాలి.. వ్యాపారులు పండుగ చేసుకోవాల.. కానీ ఇప్పుడు పరిస్థితి తల్లకిందులు అవుతోంది. విక్రయాలు పూర్తిగా మందగించాయి. ఇదే పరిస్థితి ఉంటే.. భవిష్యత్తులో అనకాపల్లి బెల్లం గురించి అంతా మరిచిపోవాలి అంటున్నారు.
అధికారుల తీరే అందుకు కారణం అంటూ.. బెల్లాం లావాదేవీలను రద్దు చేశారు వ్యాపారులు. జిల్లా కలెక్టర్ తో జరిగే చర్చల్లో ఊరట కలిగించే హామీలు ఇస్తేనే మళ్లీ లావాదేవీలు కొనసాగిస్తామంటున్నారు.. ప్రస్తుతం ఒక్కరోజు మాత్రమే లావాదేవీలు ఆపేశం అని.. అధికారులు ఇదే పంథాను కొనసాగిస్తే శాశ్వతంగా లావాదేవీలు నిలిపివేస్తామంటున్నారు వర్తకసంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ.
అయితే వారి నిరసనకు కారణం ఏంటంటే.. పోలీసు అధికారులు పెట్టిన కండిషన్లే.. నాటుసారా తయారీకి నల్ల బెల్లమే కారణమంటూ బెల్లం వ్యాపారులపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటున్నారు. ముఖ్యంగా బెల్లం పది కేజీలపైగా ఎవరైనా కొనాలి అంటే.. వారు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాలని రూల్ పెట్టారు..
దీంతో ఎవరు పది కేజీలు దాటి బెల్లం కొనడానికి ముందుకు రావడం లేదంటున్నారు. దీంతో పాటు నిత్యం ఏదో ఒక పేరుతో నాటు సారా తయారు చేసేవారిని వదిలి.. బెల్లం వ్యాపారం చేసుకున్న తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం విక్రయించిన వ్యాపారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి హెచ్చరించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఇతర బెల్లాల కంటే నల్లబెల్లాని ఎక్కువ డిమాండ్ ఉంటుందని.. ఇంటి అవసరాలకు కొనేవారు సైతం నల్లబెల్లమే అడుగుతారని.. కానీ నల్లబెల్లం అమ్మవద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని చిత్తూరు, రాజమహేంద్రవరం, నిడదవోలు తదితర మార్కెట్ యార్డుల్లో బెల్లం లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేశారు.
అనకాపల్లి మార్కెట్ యార్డుకు వచ్చే బెల్లం చాలా వరకు బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీనిలో మొదటి, రెండో రకంతోపాటు నల్లబెల్లం (మూడో రకం) కూడా వుంటుంది. ఏపీలోని పలు జిల్లాలకు అనకాపల్లి బెల్లం సరఫరా అవుతున్నప్పటికీ దీనిలో నల్లబెల్లం మాత్రం వుండదని వ్యాపారులు చెబుతున్నారు.