Edible Oil: సామాన్యుడి చితికిపోతున్నాడు.. మద్య తరగతి ప్రజలకు బతుకు భారమవుతోంది. రోజు రోజుకూ పెరిగిన ధరలు కన్నీరు పెట్టేలా చేస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టు పరిస్థితి మారింది. మరోసారి వంటనూనె ధరలు పెరగడంతో.. వాటి జోలికి వెళ్లే పరిస్థితి భవిష్యత్తులో కనిపించదేమో.. ఇలాగే ఆయిల్ ధరలు పెరుగుతూ పోతే నూనె సంగతి మరిచిపోవాల్సిందే..
ఇక పొద్దు తిరుగుడు నూనె లీటరుకు 135ల దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. దేశీయంగా నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుసెనగ నూనెకు అధిక డిమాండ్ పెరగడం.. ఇలా పలు కారణాలతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత నుంచి చైనా మన దేశం నుంచి వేరుసెనగ దిగుమతుల్ని పెంచింది.
ప్రస్తుతం అక్కడ వేరుసెనగ నూనెకు డిమాండు ఎక్కువ పలుకుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 104 లక్షల టన్నుల వేరుసెనగ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. 100 లక్షల టన్నులే వస్తుందని ఈ నెల 14న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడైంది. దేశంలో 9 రకాల నూనెగింజల పంటలు కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించగా, రెండో ముందస్తు అంచనాల ప్రకారం 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు.
మన దేశం విషయానికి వస్తే.. వేరుసెనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్ నెంబర్ వన్ గా నిలుస్తోంది. దేశ ఉత్పత్తిలో 45 శాతం పంట కేవలం జరాత్ లోనే పండుతుండడం విశేషం. రెండో స్థానంలో ఉంది రాజస్థాన్.. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లు ఉన్నాయి. గుజరాత్‌లోని గోండల్ ప్రాంతంలో వందకు పైగా నూనెతయారీ పరిశ్రమలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆయిల్‌ఫెడ్ కూడా అక్కడి నుంచే నూనెను దిగుమతి చేసుకుని విజయ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ఐతే ఈ ఏడాది గుజరాత్లో వేరుశనగ పంట ఉత్పత్తి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగా అన్ని రాష్ట్రాల్లోనే వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో తాజాగా పెరిగిన ధరల ప్రకారం క్వింటాళ్‌కు 7,400 రూపాయల నుంచి 8,400 రూపాయల వరకు ధర పలుకుతోంది. పొద్దుతిరుగుడు నూనె లీటరు ధర 135 రూపాయల దగ్గర ఉంటుంది. దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు విధించడం కారణంగా దేశీయంగా వంట నూనెల ధరలు పెరుతుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.