శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ తీరం దాటింది. సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి.
గుంటూరు, విజయవాడ నగరాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే.. గులాబ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రలో గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో.. చాలాచోట్ల విద్యుత్ స్థంభాలు, పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా ఊళ్లలో అంధకారం అలుముకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది.