బాలిక అసమాన్య పోరాటాన్ని ఆర్మీ అధికారులతో సహా అందరూ గుర్తించారు. అందుకే రాష్ట్రీయ బాల పురస్కారానికి ఆమెను ఎంపిక చేశారు. ఆమె చూపించిన తెగువ ఎందరో భారత సైన్యానికి స్ఫూర్తిగా నిలిచింది.. ఈమె పేరు గురుగు హిమప్రియ. తల్లి పద్మావతి. తండ్రి పేరు గురుగు సత్యనారాయణ. ఆర్మీ జవానైన తండ్రి గురుగు సత్యనారాయణ.. తన భార్య, కూతురు హిమప్రియ లతో కలిసి జమ్మూలోని ఆర్మీ క్వార్టర్స్ లో ఉంటూ విధులు నిర్వహించేవారు.
ఓ రోజున తెల్లవారుజామున కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ క్వార్టర్స్ పై దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో తండ్రి సత్యనారాయణ ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది.ఒంటి నిండా దెబ్బలు తగిలినా వెరవకుండా తన తల్లితో పాటు తోటి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ దాడి సమయంలో ఆయన అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు.
వీరి స్వస్థలం శ్రీకాకుళం రూరల్ మండలం, పొన్నాం గ్రామం. ఈ సాహసాన్ని అప్పట్లోనే కేంద్రం గుర్తించింది. గతంలో రక్షణమంత్రి అభినందనలు అందుకుని.. హిమప్రియ ధైర్యసాహసాలు తెలుసుకున్న నాటి రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ జమ్ములోని ఆర్మీ క్వార్టర్స్‌కు వెళ్లి, హిమప్రియ ఇంటిని సందర్శించి ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు.
అప్పటికి హిమప్రియ వయసు 8 ఏళ్లు. తాజాగా.. హిమప్రియకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అరుదైన గౌరవం దక్కింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ప్రకటించారు. కేంద్ర మహిళ, శిశు అభివ్ళద్ది సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ యేటా ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకు ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి హిమప్రియ ఎంపికయ్యింది.
ప్రధాని చేతులమీదుగా పురస్కారంధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తారు. 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవం వర్చువల్ కార్యక్రమంలో ఆయన కలెక్టర్ లఠ్కర్ చేతుల మీదుగా ధ్రువీకరణపత్రం, రూ.లక్ష నగదు అందుకుంది.
సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం అభినందించింది.. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుండి హిమప్రియ తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు హిమప్రియను స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.