Pydithalli Ammavaru: ఉత్తరాంధ్ర ఆరాథ్యం దైవం.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి పండుగ వైభవంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతోంది. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు తొలేళ్ల సంబరం సందడిగా సాగింది.. హోరు వానను సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు.. జోరు వానలోనే ఘటాలను అమ్మవారికి సమర్పించారు.
మహిళలు ఘటాలతో ఊరేగింపుగా పులివేషాలు, విచిత్ర వేషధారణలు, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి మూలవిరాట్‌కు, ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పూజారి బంటుపల్లి వెంకటరావు. తలయారీ చిన పైడిరాజు ఘటాలతో తల్లి సేవలో తరించారు
ఉత్తరాంధ్ర ప్రజలదైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా తొలి రోజు ‘తోలేళ్ళు’ రోజున గజపతుల ఆనవాయితీ ప్రకారం కోట నుండి పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు పట్టువస్త్రాలు మరియు పసుపు కుంకుమలు తీసుకువెళ్లీ, దర్శనం చేసుకుంటారు. ఇందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబం అమ్మవారికి పట్టు వస్త్ర్రాలు సమర్పించింది.