PM Modi Tour: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన ఉత్కంఠ పెంచుతోంది. ప్రధాని నిర్ణయాలకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు నిరసనలకు పిలుపు ఇచ్చాయి. దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే అభిప్రాయంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.. విశాఖ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిరసనలకు అనుమతి రద్దు చేశారు.
ప్రధాని విశాఖలో ఉన్నంత సేపు క్షణ క్షణం అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 7.25 గంటలకు మోదీ విశాఖకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ప్రధాని రాక సందర్భంగా విశాఖ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. అలాగే సభ జరిగే ఏయూ మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిని ‘నో డ్రోన్ జోన్’గా నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ప్రకటించారు.
అలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. 12 ప్రధాని పర్యటన ముగిసినా.. 13వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే వారిపై ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రధాని శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులు ఏంటంటే..? 7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని భూమి పూజ చేస్తారు. 152 కోట్ల రూపాయలతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 3,778 కోట్ల రూపాయలతో రాయ్‌పూర్–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్ కు భూమి పూజ చేస్తారు.
566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు పనులకు శ్రీకారం చుడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరాంధ్రులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ కు తొలి అడుగు పడనుంది. 460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. 2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.