P Anand Mohan, Visakhapatnam, News18. Polavaram Visit: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్వరాగా పూర్తి చేయాలని భావిస్తున్నా.. కేంద్రం నుంచి అరకొరగా నిధులు వస్తున్నాయి. దీంతో పదే పదే కేంద్రాన్ని కలిసి నిధుల కోసం రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. కానీ ఇప్పటి వరకు అనుకున్న సహకారం లభించలేదు. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం పర్యటనకు వస్తున్నారు. సీఎం జగన్ తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
కేంద్ర మంత్రి పోలవరం స్పిల్ వే, ఎగువ-దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతాలను సందర్శిస్తారు. తర్వాత అక్కడే రాష్ట్ర బీజేపీ బృందాన్ని ఉద్దేశించి షెకావత్ ప్రసంగించనున్నారు. తరువాత పోలవరం అధికారులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి తిరిగి విజయవాడకు చేరుకుని, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో భేటి కానున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సైతం కేంద్రమంత్రి షెకావత్‌తో పాటు పోలవరం పునరావాస కాలనీలు, ప్రధాన డ్యాం నిర్మాణ పరిశీలనకు వెళ్లనున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో తప్ప ఇతర అన్ని కార్యక్రమాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రితో కలిసి పర్యటించనున్నారు. వీరి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో స్పిల్‌వే, ఫిష్ ల్యాడర్, కాఫర్‌డ్యామ్, ఈసీఆర్ఎఫ్ ప్రాంతాలను పరిశీలించి పనులను వివరాలను సీఈ సుధాకర్‌బాబు నుంచి తెలుసుకున్నారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్ స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పటికే 97.25శాతం పైగా పూర్తి అయ్యాయి.
స్పిల్ వే లో 3,30968 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు.
అదే విధంగా స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గానూ 42 గేట్లను అమర్చడం జరిగింది. మిగిలిన 6 గేట్లను అమర్చే పనులు చురుకుగా సాగుతున్నాయి.
అలాగే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను ఇప్పటికే అమర్చడం పూర్తి అయింది. అదేవిధంగా 10 రివర్ స్లూయిజ్ గేట్లను, వాటికి 20 హైడ్రాలిక్ సిలిండర్ల తో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చడం పూర్తి అయింది.
స్పిల్ ఛానెల్ లో కీలకమైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణం సైతం ఇప్పటికే పూర్తయ్యింది. అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 74.44 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. కీలకమైన ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి అయింది.
ఎగువ కాఫర్ ఢ్యాం ను 2480మీ పొడవున, 42.5మీటర్ల ఎత్తు న పూర్తి స్దాయి లో నిర్మాణం పూర్తి చేశారు.
దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులు దాదాపు 84.33% పూర్తయ్యాయి.
త్వరలోనే దీని నిర్మాణం కూడా పూర్తి కానుంది. ఇటీవలే గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం సైతం పూర్తిచేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద. ఇప్పటికే గ్యాప్2లో ఈసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి సంబందించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు అనగా దాదాపు 75శాతం పనులు పూర్తి అయ్యాయి.
గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా,కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు సైతం దాదాపు పూర్తి కావొచ్చాయి.
ఆసియాలో మొదటి సారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంక కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి కొండ తవ్వకం పనులు దాదాపు 99.37% పూర్తయ్యాయి.