ఈ ఆచారాన్ని పాటిస్తే కోర్కెలు తీరతాయని దిమిలి ప్రజల నమ్మకం. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడాలేని రీతిలో విచిత్రంగా ఉంటుంది విశాఖపట్నం జిల్లాలోని దిమిలి బురదమాంబ జాతర. యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండల పరిధిలోని కొలువుదీరిన దిమిలి గ్రామ దేవత దల్లమాంబ అనుపు మహోత్సవం సందర్భంగా దిమిలి గ్రామంలో బురదమాంబ అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు బురదమాంబ జాతర జరుగుతుంది.
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని గ్రామస్తులు కొలుస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహిమగా భక్తులు భావిస్తారు. గ్రామ పురవీధుల్లో దల్లమాంబ అమ్మవారి ఘటాన్ని ఊరేగించి మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు పూర్తి చేయడంతో దల్లమాంబ ఉత్సవాలు ముగుస్తాయి.
పూర్వం దిమిలి గ్రామంలో ఓ ఆడపిల్ల అర్ధరాత్రి దారితప్పి వచ్చిందని, ఆమెను కొందరు ఆకాతాయిలు అడ్డగించి బలత్కారం చేయబోతే వారి నుండి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి ఓ మురుగుగుంటలో బురదను ఒంటికి పూసుకుందట. అది గమనించిన గ్రామస్థులు ఆమెను రక్షించాలని ప్రయత్నించగా ఆమె భయంతో స్థానికంగా వున్న బావిలోనికి దూకి ప్రాణాలు విడిచిదంట.