ఆంధ్రప్రదేశ్ ను ఒమిక్రాన్ టెన్షన్ వెంటాడుతోంది. సౌతాఫ్రికా నుంచి శ్రీకాకుళం వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అంతటా ఆందోళన నెలకొంది. తన కూతురి పెళ్లి కోసం సంతబొమ్మాళి మండలం ఉమిలాడకు చెందిన వ్యక్తి దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా తేలగా, తాజాగా ఆయన ప్రైమరీ కాంటాక్స్ గా ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఉమిలాడలో హై అలర్ట్ ప్రకటించారు.
సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి ఒమైక్రాన్ పాజిటివ్ ఏమో అన్న అనుమానంతో హైదరాబాద్ సీసీఎంబీ కి పంపించిన శాంపిల్ రిజల్గ్ రావాల్సి ఉండగా, తాజాగా పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను కూడా సీసీఎంబీకి జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వరుసగా మూడు పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు.
ఇక కరోనా పాజిటివ్ గా తేలిన ఇద్దరినీ కూడా శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం ముగ్గురికి పాజిటివ్ గా తేలడంతో.. వారితో క్లోజ్ గా తిరిగిన దగ్గరి బంధువులలో కూడా ఆందోళన మొదలైంది. ఈ నెల 9న జరగాల్సిన కూతురు వివాహం కోసం ..ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి కూడా పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
పాజిటివ్ గా తేలిన వారు కండీషన్ నార్మల్ గానే ఉందని, అవసరమైన చికిత్స మాత్రం అందిస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తికి సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి లండన్ కు ఫ్లైట్ ఎక్కేముందు టెస్ట్ చేయగా నెగెటివ్ గా తేలింది. దీంతో అక్కడి నుంచి నేరుగా ముంబయికి వచ్చాడు. ముంబయిలో దిగిన తర్వాత చేసిన టెస్ట్ లోనూ నెగెటివ్ గా రావడంతో.. అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చి కారులో ఉమిలాడకు చేరుకున్నాడు. ఉమిలాడలో నిర్వహించిన టెస్టులో కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆయన జినోమ్ సీక్వెన్సింగ్ హైదరాబాద్ సీసీఎంబీకి పంపించారు.
కాగా.. ఆ వ్యక్తిని ఒమైక్రాన్ పాజిటివ్ గా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించామన్నారు కలెక్టర్. నివేదిక రావడానికి వారం రోజుల సమయం పడుతుందని.. ఆ రిపోర్ట్ రాగానే ఏ వేరియంట్ నిర్ధారణ జరుగుతుందన్నారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.. ఇప్పుడే ఓమిక్రాన్ గా నిర్దారణ చేయలేమన్నారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తుంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. స్ధానిక తహశీల్ధార్, ఎంపీడీవో, ఇతర అధికారులు కూడా గ్రామం లోని పరిస్దితులను సమీక్షిస్తున్నారు. వైద్య సిబ్బందిని గ్రామంలోనే వుంచి.. అవసరమైన వారికి కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్ ల వద్ద పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటుచేసారు. అవసరమైన పారిశుద్య పనులు, బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేయడం వంటివి చస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా గ్రామస్తులంతా పాటించేలా చూస్తున్నారు.