అదో అత్యాధునిక హొటల్. మరో రెండు నెలల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అదేంటి విశాఖలో బోలెడు హొటల్స్ ఉన్నాయి కదా అంటారు. నిజమేకానీ.. ఇది సోలార్ పవర్ పై నడిచే అందమైన హొటల్. మొత్తం సూర్యరశ్మి నుంచీ వచ్చే విద్యుత్తుతోనే నడుస్తుంది. అంతేకాదు.. ఈ హొటల్ ప్రత్యేకించి కరెంటు బిల్లు కూడా కట్టక్కర్లేదు. ఆ హొటల్ విద్యుత్ వాడుకోగా.. మిగతాది ఏపీఈపిడీసిఎల్ కొనుక్కుంటుంది. విశాఖలో ఇలాంటి అందమైన.. పర్యావరణ పరిరక్షణ చేసే హొటల్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
విశాఖలో అత్యంత రద్దీగా ఉంటే ప్రాంతం గురుద్వారా జంక్షన్. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కి కేవలం కిలోమీటర్ దూరంలో ఈ జంక్షన్ ఉంది. నిత్యం రద్దీగా ఉండే గురుద్వారా జంక్షన్ వద్ద ఈ ఆధునిక భవంతి నిర్మాణం జరిగింది. ఇది ఒక సోలార్ ప్యానల్ ఎలివేషన్ తో నిర్మాణం జరిగిన ఫుల్ ఎకో గ్రీన్ హోటల్. ఇది 100 శాతం గ్రీన్ బిల్డింగ్ అని రేపో మాపో ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇస్తుందగట.
ఈ అత్యాధునిక హోటల్ ను బాబ్జి అలియాస్ నారాయణరావు తన ఆలోచన మేరకు పూర్తిగా సోలార్ ప్యానెల్స్ తో నిర్మించారు. అవి చూడటానికి డిజైన్ లాగా కనిపిస్తున్నా మొత్తం ఎకో ఫ్రెండ్లీ కోసమే డిజైన్ చేశామని బాబ్జి చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలోని స్మార్ట్ సిటీ అయిన విశాఖలోఈ స్మార్ట్ భవనం నిర్మితమైంది. దూరం నుంచి చూసే వారికి అది సాధారణ భవంతి లాగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూసిన వారికి దీని అసలు సంగతి అర్ధమవుతుంది.
ఇక పాయింట్ కి వస్తే సహజంగా ఇలాంటివి విదేశాల్లో నిర్మించారని వార్తల్లో వింటుంటాం. కానీ.. ఇప్పుడు అలాంటి భవనం విశాఖలో అందుబాటులోకి రావటం నగరానికి మరింత పేరును తెచ్చిపెడుతోంది. ఈ స్మార్ట్ హోటల్ భవిష్యత్తుకు చాలా దగ్గరగా నిర్మాణం అవుతోందని తెలుస్తోంది. అయిదు అంతస్తుల ఈ స్మార్ట్ హోటల్ భవనానికి మొదటి అంతస్తు నుంచి భవంతి పైవరకూ చుట్టూ సోలార్ ప్యానెల్స్ ను అందంగా ఏర్పాటు చేశారు.
ఈ ప్యానెల్స్ రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని బాబ్జి వెల్లడించారు. నెట్ మీటరింగ్ ద్వారా వినియోగం తరువాత మిగిలిన విద్యుత్తును సదరు హోటల్ గ్రిడ్ కు అందిస్తుంది. దీని ద్వారా వారికి అదనంగా ఆదాయం లభిస్తుంది. ఎలివేషన్ కోసం నలుపురంగు అద్దాలకు బదులు.. ఈ సోలార్ ప్యానళ్లను బిగించటం వల్ల కొద్దిగా ఖర్చయినా కొత్తదనంతో పాటు అదనపు ఆదాయం రానుంది.
ప్రతి రోజూ విద్యుత్ వినియోగం దాదాపు 150 యూనిట్లు మాత్రమే ఉంటుందని బాబ్జి అంటున్నారు. ఇక రోజువారి సోలార్ నుంచీ కనీసంగా మూడువందల కిలో వాట్ల విద్యుత్ వస్తుందన్నది అంచనా. ఈ మిగులు విద్యుత్ పోగా.. తిరిగి గ్రిడ్ నుంచీ బిల్డింగ్ కే తిరిగి సోలార్ నిమిత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే హొటల్ అవసరాలకు పోనూ.. మిగతా విద్యుత్ ని విక్రయిస్తే వీరికి లాభాలే కదా.