ఓ స్మాల్ బ్రేక్ అంటూ ఒకటి రెండు రోజులు విరామం ఇచ్చినా.. మళ్లీ వర్షాలు దంచికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీని మరో వాయుగుండం భయపెడుతోంది. శనివారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఇవాళ, రేపు, ఎళ్లుండి భారీ నుంచి మొస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
సుమారు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా వాయుగుండం ప్రయాణించింది. ఇది ఇవాళ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదగా.. దాదాపు పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 640 కి.మీ, సాగర్ ద్వీపానికి దక్షిణాన 670 కి.మీ, బారిసాల్(బంగ్లాదేశ్)కు దక్షిణ – నైరుతి దిశలో 820 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది అంటున్నారు.
ఇక రాయలసీమలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా కడప, అనంతపురం జిల్లాల్లో ఎన్నడూ లేనంతంగా ఆకాశం చిల్లు పడిందా అనే రేంజ్ లో వానలు కురిశాయి. మరోసారి భారీ వానలు పడితే తీవ్ర ఇబ్బందులు తప్పవు. తాజా వాయుగుండం కారణంగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో రేపు ఎల్లుండి.. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.