P Anand Mohan, Visakhapatnam, News18. Saif Seas: అసలే వేసవి.. కాలం.. అందులోనూ విద్యార్థులకు సెలవులు.. ఇలాంటి సమయంలో పర్యాటక ప్రేమికులు.. విశాఖ వచ్చి.. సముద్ర తీరాన సందడి చేయాలని ఆశపడతారు.. కానీ అందర్నీ ఒకటే భయం వెంటాడుతూ ఉంటుంది. బీచ్ లో అలల్లో తేలియాడుతూ ఎంజాయ్ చేయాలని అంతా ఆనందపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో రాకాసి అలలు ఎన్నో కుటుంబాల్లో పెను విషాదం నింపుతున్న సంఘటనలు ఎన్నో.. అందుకే కొందరు బీచ్ లకు వెళ్లాలి అంటేనే భయపడతారు.
చాలాసార్లు అలలు ప్రమాదకరంగా మారుతుంటాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగరకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని రక్షించే ప్రయత్నాల్లో ఉండగానే.. మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు సైఫ్ సీస్ సై అంటున్నాయి.
విశాఖ నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్‌గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్‌గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్‌సీస్ పేరుతో డ్రోన్‌ను తయారు చేసింది.
సాధారణంగా దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే.. విశాఖపట్నంలో ఉండే బీచ్ ల రూపురేఖలు చాలా విభిన్నంగా కనిపిస్తుంటాయి. కొన్ని బీచ్ ల్లో తేడాలను పరిశీలిస్తే.. మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు. ఇక గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు.
కానీ విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర పరిస్థతి భిన్నంగా ఉంటుంది. కేవలం పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంటుంది. ఆర్కే బీచ్‌కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు అలా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్‌నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది.
అందుకే విశాఖ బీచుల్లో ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్‌సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి.
సాధారణంగా లైఫ్‌గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్తుంది. అంటే 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్గార్డుకు పడుతుంది. అంటే గజ ఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్లు ముందుకు వెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు.
ఒడ్డున నిలబడే రిమోట్ తో దీన్ని ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి దగ్గరకు సైఫ్ సీస్ ను పంపొచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతాయి. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది.