P Anand Mohan, Visakhapatnam, News18. Pan Leaves: తమలపాకు.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతాన లేమికి ఇది దివ్య ఔషదం అంటున్నారు. దీంతో పాటు అందరి నోటికి రుచి అందిచడమే కాదు. ఎర్రగా పండేలా చేస్తుంది. ఇలా అందరి నోళ్లను పండిస్తున్నా సాగు చేసే రైతు బతుకు మాత్రం పండడం లేదు. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.
ఆక్సీకరణ వల్ల నూనెలు చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. ఆ ప్రక్రియను తమల పాకులు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. నిల్వచేసిన నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకుల వేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.. అలాగే తమలపాకులోని ‘చెవికాల్’ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
తమలపాకు, సున్నం, వక్క ఈ మూడూ మంచి జోడీ. సున్నం ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం)ను అడ్డుకుంటుంది. తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను అంతర్గత అవయవాల్లోకి చేరిస్తే, వక్క లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే భోజనం తరువాత పాన్ వేసుకోవాలని పెద్దలు సంప్రదాయన్ని పెట్టారు.
తలనొప్పితో ఇబ్బంది పడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. అంటున్నారు. అలాగే తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి అంటున్నారు.
కానీ గడిచిన రెండు సంవత్సరాల్లో కరోనా కారణంగా తోటల్లో ఆకు కోసే పరిస్థితి లేకపోవడంతో కోతలు వదిలేశారు. దీంతో కోతకు వచ్చిన ఆకులు ముదిరిపోయి పాడైపోయాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఏవిధమైన ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు సాగుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 30 నుంచి 50 ఎకరాల వరకు తమలపాకు సాగు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం బుట్ట ఆకుల ధర ఆకుల సైజును బట్టి 400 రూపాయల నుంచి 900 రూపాయల వరకు పలుకుతోంది. తెగుళ్ల బెడద కారణంగా దిగుబడి లేదు. ఈ ప్రాంత తమలపాకులను నాగపూర్ ఎగుమతి చేస్తుంటారు. ఎకరంలో 25 నుంచి 30 బుట్టలు మాత్రమే దిగుబడి వస్తోంది. ఎకరాకు 3లక్షల రూపాయల పైబడి పెట్టుబడులు పెట్టి సాగుచేసినా తెగుళ్ల బెడద కారణంగా దిగుబడి రాకపోవడంతో తమలపాకు సాగును వదిలేస్తున్నారు రైతులు.