Custard Apple: వింటర్ లో విరివిగా లభించే పండ్లలో సీతాఫలం చాలా ముఖ్యమైనది. మధురమైన రుచిని అందించడంతో పాటు శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు సీతాఫలం సొంతం. ఇందులో విటమిన్ ఏ, బీ6,సీ లతో పాటు మెగ్నీషియం, కాపర్, పోటాషియ, ఫైబర్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. పురుషులలో ఏర్పడే నరాల బలహీనత.. కండరాల వృద్ధిని పెంచే గుణాలు సీతాఫలం లో మెండుగా ఉన్నాయి. అంతేకాదు రైతులకు సిరులు కురిపిస్తోంది కూడా..
ముఖ్యంగా నరాల బలహీనత సమస్యతో బాధపడే పురుషులు ఉదయాన్నే ఒక సీతా ఫలాన్ని తీసుకోవటం వలన సమస్యను దూరం చేసుకోవడమే కాకుండా శరీరాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు. అంతేకాదు సన్నగా బలహీనంగా ఉన్నారా? దీనికి సీతాఫలం ఒక చక్కటి పరిష్కారం చూపుతుంది అంటున్నారు వైద్యులు. సీతా ఫలాన్ని.. తేనెను తగిన మోతాదులో తీసుకోవడం వలన ఎటువంటి ఎఫెక్ట్స్ లేని ఆరోగ్యవంతమైన బరువును పొందుతారు.
ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలాన్ని జ్యూస్ గా లేదా నేరుగా తీసుకోవడం వలన ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు అల్సర్, గ్యాస్, ఎసిడిటి వంటి ఉదర సమస్యలను కూడా నివారిస్తుంది. సాధారణంగా వయసు పైబడటం వలన చాలా మంది జాయింట్ పెయిన్స్ మరియు కీళ్ళ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
రాష్ట్రంలో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో సీతాఫలం పంట అధికంగా సాగు అవుతోంది. ఏటా వర్షాకాలంలో ఆరంభమై శీతాకాలం ముగిసేవరకు సీతాఫలం సీజన్ కొనసాగుతుంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పంట చేతికి రావడంతో గిరిజనరైతులు సంబరపడుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు.
నాణ్యమైన దిగుబడులు... పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, సాలూరు, మక్కువ, జి.ఎల్.పురం, జియ్యమ్మవలస, కురుపాం, పాచిపెంటలోని కొండ ప్రాంతంలో సుమారు 5 వేల ఎకరాల్లో సీతాఫలం పంట సాగువుతోంది. శతశాతం సేంద్రియ పద్ధతిలోనే పంట సాగుచేస్తున్నారు. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండానే వాతావరణ ప్రభావంతో పంట పక్వానికి వస్తుంది. అందుకే రుచిగా ఉంటాయి.
భారీగా లాభాలు.. ఒక్క మన్యం జిల్లాలోనే ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క. అంటే కిలో 15 నుంచి 25 రూపాయలకు గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసి గ్రేడ్లుగా విభజిస్తారు. తర్వాత సాధారణ రకాన్ని మార్కెట్లో 40 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతారు. గ్రేడ్–1 రకం 70 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో ఏటా సుమారు 100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం సాగుతున్నట్టు అంచనా.