తన భార్య ప్రేమకు గుర్తు గా షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ (Taj Mahal) గురించి అందరికీ తెలుసు.. కానీ ఇంచుమించు అదే నేపథ్యం ఉన్న ప్రేమ కథ మన తెలుగునేలపై జరిగిందని మీకు తెలుసా..? ఆగ్రా (Agra) లోని యమునా నది తీరాన తాజ్మహల్ ఉంటే, విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరాన మరో తాజ్మహల్ ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా…?
తన భార్య ముంతాజ్ కు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మిస్తే.. దాన్ని ఆదర్శంగా తీసుకున్న కురపాం రాజా వీరభద్ర బహదూర్ కూడా తన భార్య గుర్తుగా ఈ మినీ తాజ్ మహల్ ను నిర్మించారు. ఈ రెండు కట్టడాలు ప్రేమకు చిహ్నాలే. విశాఖ సాగరతీరం వుడా పార్క్ నుండి భీమిలి వెళ్ళే రహదారి, వాల్తేరు సెంటర్లో.., చూడగానే ఆకట్టుకునే నిర్మాణ శైలితో ఈ కట్టడాన్ని నిర్మించారు.
కురపాం జమీందారు రాజా వీరభద్ర బహదూర్ రాజా తన భార్య మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం ఈ కట్టడం నిర్వహించారు. అనకాపల్లి జమీందారు నారాయణ గజపతి రావు రెండో కుమార్తె రాణి లక్ష్మీ నరసాయమ్మ పట్ట మహాదేవికి, కురపాం జమీందారు రాజా వైరిచర్ల వీరభద్ర బహదూర్ కి 1895లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 7 ఏళ్ల తర్వాత ఆమె హఠాత్తుగా మరణించారు. ఆమె చూపిన ప్రేమ, వాత్సల్యాన్ని రాజా వారు మర్చిపోలేక.., రాజా వీరభద్ర బహదూర్ చాలా రోజులు కోటకే పరిమితమై, నిత్యం ఆమె ఆలోచనలతోనే ఆయన గడిపేవారు.
సినిమా, సీరియల్ షూటింగ్లతో సందడిగా ఉండే ఈ మినితాజ్ మహల్..ఇప్పుడు నిర్మానుష్యంగా తయారయ్యింది. అప్పట్లో రాజావారి ప్రేమకు చిహ్నంగా ఉన్న ఈ వైజాగ్ తాజ్ మహల్ నిర్మాణం… ఇప్పుడు ఎవరు గుర్తు పట్టని రీతిలో ఉంది. చుట్టూ అపార్ట్మెంట్లు, పెరిగిపోవడంతో… ఇక్కడ ఓ నిర్మాణం ఉంటుందన్న కూడా ఎవరికీ తెలియడం లేదు.. దీనికి తగిన గుర్తింపు మళ్లీ రావాటంటే… అది ఆ కురుపాం వంశీకులు ఎవరైనా వారసులు వస్తేనే తిరిగి పూర్వ వైభవం వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.