P Anand Mohan, Visakhapatnam, News18. Womens Day Celbrations: ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ హాలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. సమాజంలో ఆడ, మగ అనే లింగబేధం ఉండకూడదనే స్లోగన్ తో ఈ వేడుకలను నిర్వహించారు. ఆ మార్పు విద్యార్ధులతోనే సాధ్యపడుతుందని ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళా వివక్ష, లింగబేధం ఉందని దాన్ని ముందుగా విడనాడాలని, ఆ మార్పును విద్యార్ధులు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఇదేస్పూర్తితో ప్రతీ విద్యార్ధినీ లక్ష్యాన్ని నిర్ధేశించుకొని అనుకున్న విజయాలను సాధించాలని కోరారు.
మన సమాజంలో ఉండే మహిళలను స్పూర్తిగా తీసుకొని.. మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని, లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ముందుకుసాగడం ద్వారా మహిళలు మరింత అభివృద్ధి పథంలో ఉంటారన్నారు. రెవిన్యూ సంయుక్త కలెక్టర్ యం.విజయసునీత మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సునీత విలియమ్స్, కల్పనాచావ్లా వంటి మహిళలు అంతరిక్షంలోకి దూసుకుపోయారని పేర్కొన్నారు.
మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీలేదని, ప్రతీ మహిళ ఒక శక్తి కెరటం అని గుర్తుచేసారు. కఠోరమైన శ్రమ, లక్ష్యంతో ముందడుగు వేస్తే మహిళలు కోరుకున్న రంగంలో నిలదొక్కుకోగలుగుతారని ఆమె స్పష్టం చేసారు. అనునిత్యం శ్రమించాలని, శ్రమే మహిళల ఆయుధమని, అదే తమ జీవితాలను మారుస్తుందని ఆమె విద్యార్ధులకు ఉద్భోదించారు. ఆడ, మగ అనే లింగవివక్షను విడనాడే మార్పును సమాజంలో తీసుకురావాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు.