ఈ సారి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవడం ప్రత్యేకంగా నిలిచాయి. నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ ఆమె స్వాగతం పలికారు. నేవీ డేని పురస్కరించుకుని భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్ ను ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.
ఐఎన్ఎస్ సింధు వీర్ సబ్మెరైన్ ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్లలోకి దిగారు. ఆ బోట్లు ఎంతో వేగంతో దూసుకొచ్చాయి. తీరంలో కమాండోలు యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. ఆపద సమయాల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ప్రదర్శించారు.
ఈ విన్యాసాల్లో ఏఎల్ హెచ్ హెలికాప్టర్లు, అత్యాధునిక యూహెచ్ బీ హెలికాప్టర్లు కూడా పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగివున్న అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా నేవీ డే విన్యాసాల్లో ప్రదర్శించారు. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ విమానాలు ఆకాశంలో తిరుగుతూ విన్యాసాలు చేయడం ఆసక్తి కలిగించింది.
విశాఖ ఆర్ కే బీచ్(Visakha RK Beach)లో జరిగిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో శత్రువులపై దాడి చేసే విన్యాసాలు, బోట్లతో సముద్రం నుంచి వేగంగా.. ఒడ్డుకు రావడం, యుద్ధనౌక విన్యాసాలు, గగనతలంలో హెలీకాప్టర్ల సాహసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిగ్-29 యుద్ధవిమానాల ప్రదర్శన తీరు ఆసక్తిగా తిలకించారు.
జెమినీ బోట్ లోకి హెలికాప్టర్ నుంచి దిగిన మెరైన్ కమాండోలు సముద్ర జలాలపై వేగంగా ఒడ్డుకు దూసుకురావడం హైలెట్. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ బోట్ నుంచి హెలికాప్టర్లలోకి దాడి చేసేందుకు మెరైన్ కమాండోలు గాల్లోకి లేచారు. గగన వీధుల్లో త్రివర్ణ పతాక రెపరెపలతో హెలీకాప్టర్ విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.