P Anand Mohan, News18, Visakhapatnam. Oil Price: వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యులు వంట నూనె కొనాలంటే వణికిపోతున్నారు. వంటనూనెల ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ఫ్లవర్ ఆయిల్ (Sunflower Oil) సరఫరాపై ప్రభావం పడింది. మరోవైపు ఇండోనేషియా(Indonesia) పామాయిల్ ఎగుమతుల్ని కొంతకాలం నిషేధించింది.
అయితే సాధారణంగా మిగిలిపోయిన వంటనూనెను బయట పారబోయడం, తోపుడుబండి వ్యాపారులకు విక్రయించడం చేస్తుంటారు కొందరు. మరికొందరు డబ్బుపై అత్యాశతో అలాంటి నూనెను ప్యాకింగ్ చేసి మరీ విక్రయిస్తున్నారు కూడా. కల్తీ నూనెను విక్రయించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగులు వంట నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.
గతేడాది జనవరి నుంచి పెరగడమే గానీ తరగడం ఎరుగని రైతులుకు మాత్రం ప్రస్తుతం షాక్ తగిలింది. ఒక్కసారిగా రేట్లు తగ్గడంతో వారి గుండె గుబేల్ అంటోంది. గత జనవరిలో 15వేల ధరతో పరుగు ప్రారంభించిన పామ్ఆయిల్ గెలలు ధర దాదాపుగా ప్రతి రెండు నెలలకు 2 వేల చొప్పున పెరుగుతూ.. ఈ ఏడాది జూన్ నాటికి 23 వేల రూపాయలకు చేరింది.
ఇదే కాలంలో పామ్ఆయిల్ కిలో 65 రూపాయల నుంచి 135 రూపాయలకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు 15 శాతం నుంచి 20 శాతానికి తగ్గాయి. దాని ప్రభావం పామ్ఆయిల్ తోటలు సాగుచేసే రైతులపై విపరీతంగా పడింది. గెలల ధర ఒక్కసారిగా 25 శాతం పడిపోయింది. వాస్తవానికి జూలై 15న టన్ను పామాయిల్ గెలల ధర 23వేల నుంచి 20 వేల రూపాయలకు పడిపోయింది. ఒక్కసారిగా 3 వేలు పడిపోయినప్పటికీ రైతులు పెద్దగా ఆందోళన చెందలేదు.
ఉక్రెయిన్ దేశంనుంచి పొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్) ఆయిల్ ఎగుమతులు మొదలు కావడంతో సహజంగానే పామాయిల్ నూనెకు గిరాకీ తగ్గింది. దీనికితోడు పామాయిల్ నూనె ఉత్పత్తికి రారాజు అయిన ఇండోనేషియా కూడా పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేసింది.
ఈ రెండు పరిణామాల కారణంగా భారత్ పామాయిల్ ధరలకు కళ్లెం పడింది. దీని ప్రభావం పామాయిల్ సాగు రైతులపై నేరుగా పడుతోంది.
మరో 3 వేలు పతనం పెరిగిన ధరలో 3వేలు తగ్గినా టన్ను 20 వేల ధరతో సంతోషపడుతున్న రైతులపై మరో పిడుగు పడింది. జూలై 31 నాటికి మరో 3 వేల రూపాయలు తగ్గి ప్రస్తుతం 17 వేలకు చేరింది. నెల రోజుల వ్యవధిలోఇలా 6 వేలధర తగ్గడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ఒక్కసారిగా పామాయిల్ సాగుకు మళ్లిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో మరింత రేట్లు తగ్గే అవకాశం ఉందని తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.