G20 Summit 2023: విశాఖ వేదికగా జీ20 సమ్మిట్ సందడిగా సాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు. సాగర నగరం ప్రతి ఒక్కరికీ మధురమైన అనుభూతిని మిగుల్చుతుందని అన్నారు. ఈ సమ్మిట్ కు హాజరైన ప్రతినిధులకు మర్యాదపూర్వకంగా అదిరిపోయే విందు అందించారు.
జీ 20 సమ్మిట్ లో డెలిగేట్స్ ముందు ఆంధ్రప్రదేశ్ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. అలాగే 22లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటూ వివరించారు. ఒక్కోచోట పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని జీ-20 డెలిగేట్స్ దృష్టికి తీసుకెళ్లారు.
సస్టెయిన్‌బుల్ పాలసీలతో సరైన మార్గనిర్దేశకత్వం చేయగలిగితే పేదలకు ఇళ్లు సమకూరతాయన్నారు. జీ-20 సమ్మిట్‌లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ IWG సమావేశాలు జరుగుతున్నాయ్. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు మరో మూడ్రోజులపాటు సాగనున్నాయ్. వన్ ఎర్త్-వన్ ఫ్యామిలీ-వన్ ఫ్యూచర్ థీమ్‌తో అనేక సమస్యలపై చర్చించబోతున్నారు ప్రతినిధులు.
తొలిరోజు నాలుగు సెషన్లు
జీ20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు మంగళవారం ఉదయం విశాఖ సాగర తీరంలో ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు నాలుగు సెషన్లు నిర్వహించగా 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను పెంచడం తదితర అంశాలపై చర్చించారు.
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగాం (యూఎన్డీపీ), ఆర్గనేజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ), యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ (ఈబీఆర్డీ) వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన నిపుణులు సెషన్లలో పాల్గొన్నారు.
అలాగే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ జియోగ్రఫీ, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్, యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధులు జాతీయ మౌలిక సదుపాయాల వ్యయాన్ని మెరుగుపరచడంపై సదస్సులో కేస్ స్టడీస్‌ను సమర్పించారు. జీ 20 సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులకు రాడిసన్ బ్లూ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద సన్నాయి మేళాలతో ఆహ్వానం పలికారు. అతిథుల నుదుట తిలకం దిద్ది హారతి పట్టారు.
ఈ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. విశాఖ ఘనత అందరికీ తెలిసే ఏర్పాట్లు చేసింది. సదస్సు నేపథ్యంలో నగరంలో 2,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ ప్రాంగణంలోకి మీడియా సహా ఎవరినీ అనుమతించలేదు. మరోవైపు పర్యాటక ప్రాంతాలను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఈ రెండు రోజులు స్థానికులకు అక్కడ అనుమతి లేదని చెప్పారు.